ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ పులివెందుల నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలపై పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నవంబర్ 1న జరగబోయే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున పులివెందుల పట్టణంలో పెద్ద ఎత్తున అల్లర్లు, విధ్వంసం సృష్టించడానికి జగన్, అవినాష్ రెడ్డి భారీ కుట్రకు తెరలేపారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : తుఫాన్ వేళ వాట్సాప్ గవర్నెన్స్‌తో ప్రభుత్వం సక్సెస్..!
ఈ కుట్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు అత్యంత ప్రమాదకరమైన స్కెచ్ వేశారని బీటెక్ రవి పేర్కొన్నారు. పోలింగ్ రోజున వైసీపీకి చెందిన ప్రచార వాహనాలను, అలాగే వారి సొంత మీడియా సంస్థ అయిన సాక్షికి చెందిన వాహనాలను ఆ పార్టీ శ్రేణులే స్వయంగా దహనం చేసుకొనేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఆయన బాంబు పేల్చారు. స్థానికంగా తీవ్రమైన గందరగోళం, ఉద్రిక్త వాతావరణం సృష్టించి.. ఆ నెపాన్ని అధికార కూటమి ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీ నేతలపై నెట్టేయాలనేది వారి అసలు ఉద్దేశమని విమర్శించారు.
Also Read : చంద్రబాబు లేఖతో రెండు రోజుల్లో రంగంలోకి కేంద్రం..!
సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత పులివెందుల కోటలో తమ ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని బీటెక్ రవి మండిపడ్డారు. పట్టణంలో తామే ఘర్షణలకు దిగి, సానుభూతి డ్రామాలతో కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూసే ఇలాంటి కుట్రలపై పోలీసు యంత్రాంగం, ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి కఠిన నిఘా ఉంచాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.


