వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని బీజేపీ తన కొత్త జాతీయ కార్యవర్గాన్ని వ్యూహాత్మకంగా రూపొందించింది. మొత్తం 64 మంది జాతీయ పదాధికారులతో కూడిన ఈ బృందంలో పరిపాలనా అనుభవం, సంస్థాగత నైపుణ్యం, యువతకు ప్రాతినిధ్యం, ప్రాంతీయ సమతూకం, సామాజిక వైవిధ్యానికి పెద్దపీట వేశారు. కొత్త బృందంలో 40 శాతానికి పైగా సభ్యులు వెనుకబడిన వర్గాలకు చెందినవారే ఉన్నారు. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నేతలకు కొత్త కార్యవర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. త్రిపుర, అసోం, నాగాలాండ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు నేతలకు చోటు దక్కింది. ఈశాన్య రాష్ట్రాల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ సంబిత్ పాత్ర నేతృత్వంలో కొనసాగనుంది.
Also Read : జోగి రమేష్ రాజకీయ కెరీర్ క్లోజ్..?
గిరిజన వర్గాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల నుంచి నలుగురు గిరిజన నేతలను జాతీయ బృందంలోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలకు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురికి ప్రాతినిధ్యం కల్పించారు. మహిళలకు కూడా బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, సామాజిక వర్గాలకు చెందిన 10 మంది అనుభవజ్ఞులైన మహిళా నేతలను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. మతపరమైన వైవిధ్యానికి కూడా చోటు కల్పిస్తూ ఒక సిక్కు, ఇద్దరు క్రైస్తవులు, ఒక ముస్లిం, ఒక జైన, ఒక పార్సీ సభ్యుడికి ప్రాతినిధ్యం కల్పించారు.
ఇక అనుభవానికి వస్తే.. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు వసుంధర రాజే, తీరత్ సింగ్ రావత్, బిప్లబ్ కుమార్ దేవ్ కొత్త బృందంలో కీలకంగా నిలిచారు. వీరితో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన నేతలకు కూడా స్థానం కల్పించారు. కేంద్ర ప్రభుత్వంలో గతంలో పనిచేసిన నలుగురు నేతలు, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఒకరు కూడా జాతీయ బృందంలో ఉన్నారు. దీంతో పరిపాలన, విధాన రూపకల్పనపై అనుభవం కొత్త కార్యవర్గానికి కలిసిరానుంది. లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన 18 మంది ప్రస్తుత ప్రజాప్రతినిధులకు కూడా జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. వీరి ద్వారా శాసన అనుభవంతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన పార్టీకి ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది.
విద్యా, వృత్తిపరమైన వైవిధ్యానికీ కొత్త కార్యవర్గంలో ప్రాధాన్యం లభించింది. ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు వైద్యులు, పీహెచ్‌డీలు చేసినవారు, ఇంజినీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, న్యాయవాదులు ఇందులో ఉన్నారు. వివిధ మోర్చాలకు చేసిన నియామకాల ద్వారా యువత, క్షేత్రస్థాయి నాయకత్వానికి మరింత ప్రాధాన్యం లభించనుంది. మొత్తంగా.. ప్రాంతీయ, సామాజిక, మత, వృత్తిపరమైన వైవిధ్యంతో పాటు పరిపాలనా అనుభవం, సంస్థాగత సామర్థ్యాలను మేళవిస్తూ భారతీయ జనతా పార్టీ తన కొత్త జాతీయ బృందాన్ని సిద్ధం చేసింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని అన్ని స్థాయిల్లో మరింత బలోపేతం చేసేందుకు ఈ ‘పవర్ టీమ్’ కీలకంగా పనిచేయనుంది.
Also Read : బీసీలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!
ఇక ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత రామ్ మాధవ్ ఆరేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి బీజేపీ ప్రధాన సంస్థాగత నిర్మాణంలోకి అడుగుపెట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించిన నూతన జాతీయ కార్యవర్గంలో రామ్ మాధవ్‌కు జాతీయ ఉపాధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకం బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ మధ్య సమన్వయాన్ని మరింత పటిష్ఠం చేయడంలో కీలక పరిణామంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా ప్రస్థానం ప్రారంభించిన రామ్ మాధవ్.. గతంలో సంఘ్ జాతీయ అధికార ప్రతినిధిగా, అఖిల భారత సహప్రచార్ ప్రముఖ్‌గా సేవలందించారు. 2014 సార్వత్రిక ఎన్నికల విజయం తర్వాత ఆయనను ఆర్ఎస్ఎస్ బీజేపీ బాధ్యతల్లోకి పంపగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అసోం, త్రిపుర, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలో బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటులో, పార్టీ విస్తరణలో కీలక వ్యూహకర్తగా వ్యవహరించారు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ – పీడీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు వెనుక ప్రధాన పాత్ర పోషించారు. 2020 సెప్టెంబరులో పార్టీ పదవి నుంచి వైదొలిగిన తర్వాత తిరిగి ఆర్‌ఎస్ఎస్ జాతీయ కార్యవర్గంలో కొనసాగారు. ఇండియా ఫౌండేషన్ థింక్ ట్యాంక్ ద్వారా దౌత్యపరమైన, అంతర్జాతీయ వ్యవహారాల సదస్సుల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

