వై నాట్ 175 అన్నారు.. చివరికి 11 స్థానాలకే పరిమితం అయ్యారు. ఇప్పుడు మళ్లీ తమదే అధికారం అంటున్నారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఓ వైపు జగన్ పర్యటనలకు వచ్చే జనాన్ని చూసి.. మాదే గెలుపు.. మేమే గెలుస్తాం.. అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీడియా ముందు, పార్టీ సమావేశాల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు. 2029లో మేమే గెలుస్తామని కొంతమంది అంటుంటే.. మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత మీ సంగతి చూస్తామని కొందరు బెదిరిస్తున్నారు కూడా. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థతి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. వైసీపీ గెలుపు కాదు కదా.. కనీసం పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు కరువయ్యారనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది.
Also Read : నవంబర్ నుంచి పెన్షన్‌లో మార్పులు..!
2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యమని ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. అలాగే.. పార్టీ కోసం, ప్రజల కోసం తాను స్వయంగా పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. ఈ పాదయాత్ర వచ్చే ఏడాది మొదలవుతుందని వెల్లడించారు కూడా. ఇక జగన్ ఎక్కడికి వెళ్లినా సరే.. సీఎం సీఎం.. అంటూ ఓ బ్యాచ్ కేకలు వేయడం.. మోకాళ్ల మీద కూర్చుని దండం పెట్టడం, కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ చేయడం వంటి వీడియోలు ఇప్పుడు ఆ పార్టీ నేతలు బాగా వైరల్ చేస్తున్నారు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు పరిస్థితి మాత్రం వేరుగా ఉంది.
వైసీపీ అంతర్గత సమావేశంలో షాకింగ్ విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ గెలుపు అవకాశాలపై అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సహా.. మరో నలుగురు నేతలు పాల్గొన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కీలక విషయాలపైనే చర్చించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టమనే భావనకు వచ్చేశారు. అయితే ఓట్ షేర్ పెంచుకునేలా చూడాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ఇంఛార్జులను నియమించాలని ఆదేశించినట్లు సమాచారం.
Also Read : ఇస్లాంపై డోనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్..!
ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రస్తుతమున్న 175 నియోజకవర్గాల్లో దాదాపు 70 నియోజకవర్గాల్లో పార్టీకి సరైన నాయకత్వం లేదని నేతలు జగన్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. బాలినేని, మోపిదేవి, ఆళ్ల నాని, కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను, వరుపుల సుబ్బారావు వంటి నేతలు పార్టీ మారటం.. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది నేతలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం వంటి అంశాలను జగన్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. చిత్తూరు, కావలి, రేపల్లె, పాలకొల్లు, ఒంగోలు, కందుకూరు, పర్చూరు, అద్దంకి వంటి కీలక నియోజకవర్గాల్లో పార్టీని ముందుండి నడిపించే నేత ప్రస్తుతం లేడనే విషయంపై జగన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని లైట్ తీసుకున్న జగన్.. తన పాదయాత్ర మొదలైతే.. జనం తననే చూస్తారు తప్ప.. అభ్యర్థి ఎవరనే విషయం పట్టించుకోరని.. కాబట్టి.. ఆ విషయంపై చర్చ అవసరం లేదని తేల్చేసినట్లు తెలుస్తోంది. జగన్ చెప్పిన మాటలతో వైసీపీ ముఖ్యనేతలు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ 70 నియోజకవర్గాల పరిస్థితి ఏం చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.


