రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు నల్ల సముద్రం దాటి ఉత్తర ఆఫ్రికా తీర ప్రాంతమైన మధ్యధరా సముద్రానికి విస్తరించింది. ఉక్రెయిన్ యుద్ధక్షేత్రానికి సుమారు 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిబియాలోని బెంఘాజీ నౌకాదళ స్థావరంపై ఉక్రెయిన్ దళాలు అత్యంత సాహసోపేతమైన మెరుపు దాడిని నిర్వహించాయి. స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన 7 సముద్ర డ్రోన్లను ప్రయోగించి, రష్యాకు చెందిన అత్యాధునిక యుద్ధనౌక మెర్క్యురీని సముద్రంలో ముంచేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అధికారికంగా ప్రకటించారు.
Also Read: భూమన ఫేక్ ప్రచారానికి ఆధారాలతో దిమ్మతిరిగే కౌంటర్..!
రష్యా నౌకాదళంలో అత్యంత సరికొత్త యుద్ధనౌకలలో ఒకటైన మెర్క్యురీ 2023లోనే సైన్యంలోకి చేరింది. ఉక్రెయిన్ భద్రతా సంస్థ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో మానవరహిత డ్రోన్ బోట్లను ఒక ‘మదర్ షిప్’ సాయంతో లక్ష్య ప్రాంతానికి చేర్చి సముద్రంలోకి వదిలారు. రష్యా దళాలు గగనతలం, సముద్ర మార్గాల ద్వారా ఈ డ్రోన్లను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, అవి నేరుగా మెర్క్యురీ యుద్ధనౌకను ఢీకొట్టాయి. ఈ భారీ పేలుడు ధాటికి యుద్ధనౌక బోల్తా పడి సముద్రంలో మునిగిపోవడంతో పాటు, ఆ నౌకపై ఉన్న రష్యాకు చెందిన ‘KA-27’ మిలిటరీ పోరాట హెలికాప్టర్ కూడా పూర్తిగా ధ్వంసమైంది.
Also Read : భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో బీవైడీ సరికొత్త రికార్డు..!
కేవలం యుద్ధనౌకనే కాకుండా, రష్యా ఆయుధాలను రవాణా చేసేందుకు వినియోగిస్తున్న ‘MV అంగారా’ అనే భారీ కార్గో నౌకపైనా ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడి తీవ్ర నష్టం కలిగించాయి. రష్యాకు ఇంధనం నింపుకోవడానికి బెంఘాజీ పోర్టులో ఆగిన సమయంలో ఈ దాడి జరగడంతో, తమ భూభాగాన్ని విదేశీ యుద్ధాలకు వేదికగా మార్చవద్దంటూ లిబియా ప్రభుత్వాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మొత్తానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువు నౌకలను సైతం మట్టుబెట్టగల సత్తా తమకుందని ఉక్రెయిన్ ఈ ఆపరేషన్ ద్వారా రష్యాకు గట్టి హెచ్చరిక పంపింది.


