పంచాయతీ పోరు మొదలైంది. తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు జోరందుకున్నాయి. కూటమి నేతలు తమదే గెలుపని ధీమాగా ఉన్నారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీల కూటమి నేతలు.. పంచాయతీల్లో కూడా గెలుస్తామంటున్నారు. ప్రస్తుతం 4 కార్పొరేషన్లు, 19 మునిసిపాలిటీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయినా సరే.. అందరి దృష్టి మాత్రం పంచాయతీల మీదే ఉంది. గ్రామాల్లో పూర్తి ఏకపక్షంగా గెలిస్తే.. నియోజకవర్గంలో తమ పట్టు నిలుస్తుందనేది నేతల భావన. అందుకే పంచాయతీ ఎన్నికలకు బదులుగా.. ఏకగ్రీవాలకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు.
Also Read : ‘రంగమ్మత్త’కు అవకాశాలు లేవా..?
పంచాయతీ ఎన్నికలు ఒక ఎమ్మెల్యేకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. జిల్లా పరిషత్ పోరులో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లుగా మారింది ఆ ఎమ్మెల్యే పరిస్థితి. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే సారు.. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే కసితో పని చేస్తున్నారు. క్యాడర్ను పరుగులు పెట్టిస్తున్నారు. జెడ్పీటీసీ ఫలితం తారుమారు కావడంతో.. ఆ ఎమ్మెల్యేపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి టీడీపీ నేతలు బద్ధ శత్రువుగా భావించే మాజీ ఎమ్మెల్యే మనుషులు నియోజకవర్గంలో గెలవడంతో ఇప్పుడు సొంత పార్టీ నేతలే టీడీపీ ఎమ్మెల్యే పై గుర్రుగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు.. పంచాయతీ పోరు ఏకపక్షం చేయాలని క్యాడర్ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరంటే.. యార్లగడ్డ వెంకట్రావు. విజయవాడ పక్కనే ఉన్న గన్నవరం నియోజకవర్గం నియోజకవర్గం టీడీపీ కంచుకోట. వరుసగా మూడుసార్లు అక్కడ టీడీపీ అభ్యర్దులే గెలిచారు. అలాంటి గన్నవరం నియోజకవర్గం కేంద్రంలో వైసీపీ తరఫున పోటీ చేసిన జెడ్పీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. ఇది పెద్ద దుమారం రేపింది. వరుసగా టీడీపీ గెలుస్తున్న గన్నవరం మండల జెడ్పీటీసీ స్థానాన్ని కూటమి ఓడిపోవడం వెనుక ఎమ్మెల్యే వైఫల్యం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో స్వయంగా మీడియా ముందుకు వచ్చిన యార్లగడ్డ.. ఈ ఓటమి తన ఓటమి అని అంగీకరించారు. కూటమి అభ్యర్థి ఓటమికి పూర్తిగా తనదే బాధ్యత అని ప్రకటించారు కూడా.
యార్లగడ్డ వ్యాఖ్యలు సానుభూతి సాధించేందుకు అనే మాట అప్పట్లో బాగా వినిపించింది. గన్నవరం నియోజకవర్గం కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా ఆయన అనుచరులు సంబరాలు జరుపుకోవడం పట్ల పార్టీ పెద్దలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. పరువు పోయినట్లు భావించిన యార్లగడ్డ.. పంచాయతీల్లో మాత్రం పూర్తిస్థాయి పట్టు సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ రూరల్ మండలం పరిధిలో రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి వంటి పంచాయతీలు చాలా కీలకం. పేరుకే పంచాయతీలు అయినప్పటికీ.. ఇక్కడ జనాభా చాలా ఎక్కువ. వీటిని ఏకగ్రీవం చేసుకుని జెడ్పీటీసీ ఓటమి బాధ నుంచి బయటకు రావాలని యార్లగడ్డ భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా పంచాయతీల పరిధిలో ముఖ్యనేతలు, కార్యకర్తలతో వరుస మంతనాలు జరుపుతున్నారు. పోటీ విషయంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. నేతల మధ్య సయోధ్యను స్వయంగా పంచాయతీ చేస్తున్నారు. అదే సమయంలో గెలుపే లక్ష్యమని నేతలకు దిశా నిర్దేశం చేశారు.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు..!
పంచాయతీల గెలుపు కోసం ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగడంతో నియోజకవర్గంలో గుసగుసలు మొదలయ్యాయి. నిజానికి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి మంత్రి పదవి పైన గంపెడాశలు పెట్టుకున్నారు. భారీగా ఖర్చు చేశా.. వంశీ మీద గెలిచా.. నాకు ఎందుకు ఇవ్వరు.. అని నేతల దగ్గరే వ్యాఖ్యానించారు. అదే సమయంలో నియోజకవర్గంలో గ్రూపులకు తెర లేపారనే అపవాదు కూడా ఉంది. నియోజకవర్గంలో చాలా సమస్యల పరిష్కారం కంటే.. గ్రూపు తగాదాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని సీనియర్ నేతలే ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో గన్నవరం జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ నేత గెలవటంతో.. ఇది నా ఓటమే.. అని స్వయంగా వ్యాఖ్యానించారు యార్లగడ్డ. ఈ విషయంపై వివాదాలకు చెక్ పెట్టేందుకు పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు యార్లగడ్డ. మరి సక్సెస్ అవుతారా.. లేదా.. చూడాలి.


