రాజకీయాల్లో గెలుపు ఒక్కటే ప్రామాణికం కాదు.. పార్టీ సిద్ధాంతం, క్రమశిక్షణ, మిత్రపక్షాల మధ్య విశ్వాసం కూడా అంతే ముఖ్యం. ఈ సందేశాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజా నిర్ణయం ద్వారా స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అధికారిక అభ్యర్థులను కాదని, స్వతంత్రులుగా బరిలోకి దిగి విజయం సాధించిన రెబల్ అభ్యర్థులను తిరిగి పార్టీ లోకి చేర్చుకునే ప్రసక్తే లేదన్న ఆయన వైఖరి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సంఖ్యాబలాన్ని పెంచుకోవడం కోసం తిరుగుబాటుదారులను అక్కున చేర్చుకునేది లేదన్న సంకేతాల ద్వారా కూటమి ధర్మం, పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ నిర్ణయం స్థానికంగా కొత్త రాజకీయ ప్రశ్నలను కూడా ముందుకు తెస్తోంది.
Also Read : పవన్ విడాకులపై వైసీపీ మౌనం వెనుక అసలు ప్లాన్ ఇదేనా..?
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అనేది కూటమి పార్టీల మధ్య కీలక అంశం. టీడీపీ పోటీ చేయాల్సిన కొన్ని స్థానాలను జనసేన, బీజేపీలకు కేటాయించాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్థానికంగా టికెట్లు ఆశించిన టీడీపీ నేతల్లో కొందరికి నిరాశ ఎదురైంది. వారిలో కొందరు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా బరిలోకి దిగి విజయం సాధించిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి వారిని ఫలితాల అనంతరం తిరిగి పార్టీలోకి చేర్చుకుంటే మిత్రపక్షాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నది నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఒకసారి పొత్తు ధర్మాన్ని పక్కనపెట్టి తిరుగుబాటు చేసిన వారిని గెలిచిన తర్వాత ఆహ్వానిస్తే, భవిష్యత్తులోనూ టికెట్ దక్కని నేతలు అదే మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయంలో కఠిన వైఖరిని అనుసరించాలన్నది అధిష్ఠానం ఉద్దేశంగా భావిస్తున్నారు.
మొత్తంగా చంద్రబాబు తీసుకున్న కఠిన వైఖరి తక్షణ రాజకీయ లాభనష్టాల కంటే పార్టీ క్రమశిక్షణ, మిత్రపక్షాల మధ్య విశ్వాసానికి ప్రాధాన్యం ఇచ్చే నిర్ణయంగా కనిపిస్తోంది. అయితే క్రమశిక్షణ పేరుతో స్థానికంగా బలమైన నాయకత్వాన్ని దూరం చేసుకోకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. విధేయులను ప్రోత్సహించడం, అసంతృప్తులను సమన్వయం చేయడం, మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటును క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడం కూటమి నాయకత్వానికి ముందున్న ప్రధాన బాధ్యతలు. రానున్న రెండున్నరేళ్లలో పార్టీ పనితీరు. నాయకత్వ సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారమే ఈ నిర్ణయం ప్రభావాన్ని నిర్ణయించనున్నాయి.
Also Read : నాకేమీ పేటీఎంలో డబ్బులు రాలేదు.. రేణూ దేశాయ్ కీలక కామెంట్స్..!
అయితే ఈ వ్యవహారానికి మరో కోణం కూడా ఉంది. తిరుగుబాటు చేసిన నాయకులందరినీ పార్టీ వ్యతిరేకులుగా చూడలేమన్న వాదన స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కొన్నిచోట్ల అంతర్గత వర్గపోరు, స్థానిక నాయకత్వం మధ్య విభేదాలు, టికెట్ల కేటాయింపులో అసంతృప్తి కారణంగా సీనియర్ నేతలు స్వతంత్రులుగా పోటీ చేసినట్లు చెబుతున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం దక్కకపోవడం, మిత్రపక్షాలకు సీట్లు కేటాయించినప్పుడు స్థానిక కేడర్‌ను సమన్వయం చేయడంలో లోపాలు తలెత్తడం కూడా అసంతృప్తికి కారణాలుగా పేర్కొంటున్నారు. ప్రజల మద్దతుతో గెలిచిన ఇలాంటి నాయకులను పూర్తిగా దూరం పెట్టడం వల్ల పార్టీకి స్థానికంగా నష్టం కలగవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పార్టీ ఆదేశాలకు కట్టుబడి, టికెట్లు దక్కకపోయినా కూటమి అభ్యర్థుల విజయానికి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు, వివిధ కార్పొరేషన్ల బాధ్యతల్లో విధేయులకు అవకాశాలు కల్పిస్తామన్న భరోసా ద్వారా పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసిన వారిని గుర్తించి ప్రోత్సహిస్తే కేడర్‌లో క్రమశిక్షణ బలపడుతుందన్నది ఈ విధానం వెనుక ఉన్న ఆలోచనగా కనిపిస్తోంది.
Also Read : స్థానిక విజయాలతో అహం వద్దు.. మంత్రులకు సీఎం వార్నింగ్..!
చంద్రబాబు నిర్ణయం పార్టీ క్రమశిక్షణను కాపాడే ప్రయత్నంగా కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. స్వతంత్రులుగా గెలిచిన నాయకులకు స్థానికంగా వ్యక్తిగత బలం, అనుచరగణం ఉంటే.. వారిని పూర్తిగా దూరం పెట్టడం వల్ల పార్టీ ఓటుపై ప్రభావం పడే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వారిలో కొందరు ఇతర పార్టీల వైపు వెళ్లే అవకాశాన్ని కూడా రాజకీయ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. అయితే అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మరోవైపు తిరుగుబాటుదారులకు మళ్లీ అవకాశం ఇస్తే పార్టీ నిర్ణయాలను ధిక్కరించిన వారికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందన్న వాదన కూడా ఉంది.


