మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షం ఉగ్రరూపం దాల్చింది. కోస్తా తీరం నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర తుపాను కారణంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు, ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవడంతో యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది.
Also Read : మళ్లీ యాత్రల సమయం.. ఇక రెడీ..!
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాత గణాంకాలను పరిశీలిస్తే గుంటూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పొన్నూరులో అత్యధికంగా 31.2 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రమైన గుంటూరు నగరంలో 30 సెంటీమీటర్ల వర్షం కురవడంతో లోతట్టు డివిజన్లు చెరువులను తలపిస్తున్నాయి. వీటితో పాటు సత్తెనపల్లిలో 17.9 సెం.మీ., తెనాలిలో 17.1 సెం.మీ., బాపట్లలో 15.7 సెం.మీ., నరసరావుపేటలో 14.5 సెం.మీ., ఏలూరులో 14.1 సెం.మీ., మరియు చీరాలలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read : కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం..!
వారం వ్యవధిలోనే రెండో తుపాను పంజా విసరడంతో చేతికొచ్చిన పంటలు నీట మునిగి రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. మరోవైపు విజయవాడ నగరానికి మళ్లీ వరద గండం పొంచి ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ‘బుడమేరు’కు వరద ముప్పు తీవ్రమైంది. బుడమేరు డైవర్షన్ ఛానల్ పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. గతం గడ్డు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, బుడమేరు పరిసర ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల వాసులకు ప్రభుత్వం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ వెంటనే ఇళ్లు ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి సహాయక చర్యలను వేగవంతం చేశారు.


