స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు విమర్శల పాలవుతోంది. తాజాగా తొలి అభ్యర్ధిని ప్రకటించింది వైఎస్ఆర్ సీపీ – నెల్లూరు మేయర్ అభ్యర్ధిగా ఆనం విజయకుమార్‌రెడ్డిని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రిజర్వేషన్లు ఖరారు కాకుండానే నెల్లూరు మేయర్ అభ్యర్థి ప్రకటనపై కూటమి నేతలు మండిపడుతున్నారు. జగన్ వ్యూహం వెనుక ఆంతర్యమేంటి? ఇది రాజకీయ వ్యూహమా? రాజకీయ గందరగోళమా? అనేది తేలాల్చి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార కూటమికి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. దీంతో స్థానిక ఎన్నికల బరిలో వైసీపీ తొలి అడుగు వేసినట్టు భావించినా.. ఇదంతా అయోమయం కలిగిస్తోంది. దీంతో స్థానిక ఎన్నికల బరిలో వైసీపీ తొలి అడుగు వేసినట్లయింది.
Also Read : నానా పటేకర్ కు చివరి ఆ 45 నిమిషాలు.. అసలేం జరిగింది..?
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాలు అత్యంత కీలకం. ముఖ్యంగా మేయర్ పదవికి సంబంధించి రిజర్వేషన్లు ఏ వర్గానికి కేటాయిస్తారన్న అంశం అభ్యర్థి ఎంపికను ప్రభావితం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి పేరును ముందుగానే తెరపైకి తీసుకురావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రిజర్వేషన్లు ఖరారయ్యాక అభ్యర్థిని ప్రకటించవచ్చు. కానీ అంతకుముందే పేరు ప్రకటించడం వెనుక వైసీపీ వ్యూహం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అభ్యర్థికి ముందస్తుగా ప్రచారం కల్పించి ప్రజల్లోకి తీసుకెళ్లడం, నిస్తేజంగా ఉన్న క్యాడర్ ని ఉత్సాహ పరచడం ముఖ్య ఉద్దేశాలుగా చెబుతున్నారు. స్తబ్దుగా ఉన్ప నెల్లూరు నగర రాజకీయాల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చంటున్నారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న వైసీపీకి నెల్లూరు కార్పొరేషన్ కీలకంగా మారింది. గతంలో నెల్లూరు నగర రాజకీయాల్లో వైసీపీకి బలమైన పునాది ఉండగా, రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు ఇతర పార్టీల వైపు వెళ్లడం, మేయర్ పదవికి సంబంధించిన పరిణామాలు వైసీపీకి సవాలుగా నిలిచాయి. అయితే అభ్యర్థి ప్రకటన ఒక్కటే ఎన్నికల విజయానికి హామీ ఇవ్వదు.
Also Read : టీటీడీ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
స్థానిక నాయకుల మధ్య సమన్వయం, ప్రజల్లో ఉన్న ఆదరణ, బలమైన ప్రచారం కావాలి. రిజర్వేషన్లు ఖరారు కాకముందే మేయర్ అభ్యర్థిని ప్రకటిచడం తొందరపాటు చర్యగా భావిస్తున్నారు. తుది రిజర్వేషన్లలో మేయర్ పదవి ఇతర వర్గాలకు కేటాయిస్తే ఆనం విజయ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంటనే సందేహాలున్నాయి. తుది రిజర్వేషన్లు, అధికారిక ఎన్నికల నిబంధనలు వెలువడిన తర్వాతే ఈ ప్రకటన ఆచరణలో ఎంతవరకు నిలుస్తుందో స్పష్టమవుతుంది. స్థానిక ఎన్నికల్లో కూటమి ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలంటే వైసీపీకి నెల్లూరులో గట్టి పోటీ అవసరం. ఈ నేపథ్యంలో ముందస్తు అభ్యర్థి ప్రకటనతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
నెల్లూరులో పార్టీ శ్రేణులు ఆనం విజయ్ కుమార్ రెడ్డికి సహకరిస్తారా? రిజర్వేషన్లు ప్రకటించాకే అసలు చిత్రం బయటపడుతుందని.. అప్పటివరకూ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది చందంగా ఉంటుందని అంటున్నారు.
-జి.సత్యనారాయణరాజు


