ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ ఉద్యోగార్థులకు కూటమి ప్రభుత్వం తొలి మెగా శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పోలీస్ శాఖతో పాటు అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలనే కలటో ఉన్న వేలాది మంది నిరుద్యోగులకు ఈ ప్రకటన పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అత్యధికంగా 378 ఎస్సై, 1,156 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Also Read : నెయిల్ పాలిష్ వల్ల క్యాన్సర్ వస్తుందా..?
వీటితో పాటు జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖల్లో ఉన్న మిగతా ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయబోతున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది. ఎస్సై విభాగం పోస్టుల వివరాలను పరిశీలిస్తే.. అత్యధికంగా ఎస్సై సివిల్ విభాగంలో 253 పోస్టులు ఉన్నాయి. అలాగే ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 116 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పరిధిలో 9 పోస్టులను కేటాయించారు. పోలీస్ శాఖలో అత్యంత కీలకమైన సివిల్, ఏఆర్ విభాగాల్లో ఇవి మంచి అవకాశాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read : 2వ వారం ‘బిగ్ బాస్ 10’ నుండి ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే!
మరోవైపు టెక్నికల్ విభాగాలకు సంబంధించి ఎస్సై కమ్యూనికేషన్స్‌లో 50 పోస్టులు, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ పరిధిలో 10 పోస్టులను నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. ఈ ప్రత్యేక విభాగాలకు సంబంధించిన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చని బోర్డు స్పష్టం చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ, వయోపరిమితి సడలింపు, విద్యా అర్హతల పూర్తి వివరాలను ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచింది. అలాగే, ప్రాథమిక మరియు ముఖ్య రాత పరీక్షలు నిర్వహించే తేదీల షెడ్యూల్‌ను కూడా త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని బోర్డు స్పష్టం చేసింది.

