ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా కనిపించిన నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల చేరికలకంటే ఇప్పుడు అసలు కలవరం కలిగించేది మరో పరిణామం. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీకి వెన్నెముకగా నిలిచిన ద్వితీయ శ్రేణి నాయకత్వంపై అధికార కూటమి దృష్టి సారించిందన్న ప్రచారం ఊపందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ బలాన్ని తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారనే చర్చ సాగుతోంది. అదే జరిగితే.. ఎన్నికల ఫలితాల కంటే ముందే క్షేత్రస్థాయిలో వైసీపీకి గట్టి దెబ్బ తగలటం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read : యూపీఐ చార్జీలు.. ఎక్కడ, ఎంత పడతాయి అంటే..?
ఇప్పుడు జగన్ ముందున్న అసలు సవాలు.. ప్రత్యర్థిని ఎదుర్కోవడం మాత్రమే కాదు.. తన పార్టీ బలగాలను కాపాడుకోవడం కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కీలక ప్రాధాన్యం అనుభవించిన కొద్దిమంది నేతల్లో విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీను ఒకరు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు భీమిలి నియోజకవర్గానికి ఇన్ చార్జిగా వ్యవహరించారు. అంతేకాదు.. అప్పట్లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చేరువగా ఉన్న నాయకుల్లో ఆయన ఒకరనే ప్రచారం కూడా ఉండేది. అలాంటి చిన్న శ్రీను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా అందరితో కలిసి పనిచేస్తానని ఆయన చెబుతున్నారు. చిన్న శ్రీను లాంటి బలమైన నేత వైసీపీని వీడి అధికార కూటమి వైపు వెళ్లడం మాత్రం ఆ పార్టీకి రాజకీయంగా ఒక సంకేతంగానే కనిపిస్తోంది.
ఎమ్మెల్యే స్థాయి నేతలను పార్టీలోకి ఆహ్వానించడం ఒక ఎత్తయితే.. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమవైపు తిప్పుకోవడం మరో ఎత్తు. ప్రస్తుతం తెలుగుదేశం వ్యూహం ఈ దిశగా సాగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కూటమి పార్టీలు పెద్ద ఎత్తున చేరికలపై దృష్టి పెట్టలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు వైసీపీకి ఉన్న సంస్థాగత బలాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధమవుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే నియోజకవర్గాల్లో కొత్త అధికార కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ద్వితీయ శ్రేణి నేతలను ఆకర్షించడం ద్వారా అలాంటి ఇబ్బందులు లేకుండానే క్షేత్రస్థాయిలో వైసీపీ బలాన్ని తగ్గించవచ్చన్నది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : నెయిల్ పాలిష్ వల్ల క్యాన్సర్ వస్తుందా..?
స్థానికంగా ప్రభావం ఉన్న నాయకులు అసంతృప్తికి గురైతే వారిని బుజ్జగించడం అధికార పార్టీకే సులభం. కాంట్రాక్టులు, నామినేటెడ్ పదవులు, ఇతర రాజకీయ అవకాశాలతో వారిని తమవైపు తిప్పుకునే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది. దీంతో వైసీపీకి చెందిన మండల, గ్రామ, స్థానిక సంస్థల స్థాయి నాయకత్వంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదే జరిగితే.. ఎన్నికల సమయంలో కేవలం అభ్యర్థులే కాదు.. వారి వెనుక పనిచేసే స్థానిక బలగాలు కూడా బలహీనపడే ప్రమాదం ఉంది. గ్రామస్థాయిలో క్యాడర్ సన్నగిల్లితే దాని ప్రభావం భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనా పడే అవకాశం ఉంటుంది.
ఇప్పటివరకు వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరి స్పష్టంగానే ఉంది. పార్టీలో నుంచి ఎంతమంది వెళ్లిపోయినా.. మనతో ఉండేవాళ్లే మనవాళ్లు అన్న ధోరణితో ముందుకు సాగుతున్నారు. సిద్ధాంతపరంగా ఇది బలమైన వైఖరే కావచ్చు.. కానీ రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో నష్టం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. నష్టం జరగకుండా ముందే అప్రమత్తం కావడం ముఖ్యం. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ ముందుంది. స్థానిక ఎన్నికలను పార్టీ నాయకత్వం పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదన్న భావన ఇప్పటికే కొంతమంది కార్యకర్తల్లోకి వెళ్లిందనే చర్చ ఉంది. అదే సమయంలో అధికార పార్టీ నుంచి ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైతే.. స్థానిక నాయకత్వం ఎంతకాలం పార్టీలో నిలబడగలదన్నదీ ప్రశ్నగా మారుతోంది.
Also Read : వంద శాతం స్ట్రైక్ రేట్.. ఇదే టార్గెట్..!
అందుకే జగన్ ఇప్పుడు క్షేత్రస్థాయి నాయకత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాల్లోనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు వెళ్తున్నారు అన్నదానికంటే.. ఎవరిని వెళ్లకుండా కాపాడుకోవాలి? ఎక్కడ పార్టీ బలహీనపడుతోంది? ఎక్కడ నాయకత్వానికి ధైర్యం చెప్పాలి? అన్నదానిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇదేనని వారు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం స్థానిక పోరాటం కాదు. అవి పార్టీల క్షేత్రస్థాయి బలానికి కొలమానం. అక్కడే బలగాలు సన్నగిల్లితే.. రేపటి అసెంబ్లీ పోరులో ఆ ప్రభావం తప్పక కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు జగన్‌కు అసలు సవాలు ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న రాజకీయ ఒత్తిడి మాత్రమే కాదు.. తన పార్టీని క్షేత్రస్థాయిలో కాపాడుకోవడమే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

