విజయనగరం జిల్లా రాజకీయం ఒక్కసారిగా భావోద్వేగాల మయంగా మారింది. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా నిర్వహించిన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశం తీవ్ర ఉత్కంఠ రేపింది. విజయనగరం జిల్లాలో దశాబ్దాలుగా బొత్స కుటుంబానికి అత్యంత నమ్మకస్థుడిగా, కుడి భుజంలా ఉంటూ వచ్చిన సొంత మేనల్లుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడంపై ఈ సమావేశంలో కేడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read : కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో లేడీ ఆఫీసర్లకు సీఎం చంద్రబాబు శభాష్..!
సమావేశం ప్రారంభమైనప్పటి నుండి కార్యకర్తలు, స్థానిక నాయకులు ఒక్కొక్కరుగా మైక్ పట్టుకుని చిన్న శ్రీనుతో తమకు ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని, పార్టీ కోసం ఆయన చేసిన పనులను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో ప్రసంగాలను వింటున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జిల్లాలో ఇంతకాలం తామంతా ఒకే కుటుంబంగా ఉంటూ, పార్టీ ఎదుగుదలకు కలిసి నడిచిన రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన సభలోనే అందరి ముందూ కంటతడి పెట్టారు.
Also Read : అమెరికాలో కాగ్నిజెంట్ సంస్థకు భారీ షాక్..!
బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకోవడంతో గరివిడి వైసీపీ కార్యాలయంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. బొత్స ఏడుస్తుండటం చూసి సభకు విచ్చేసిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న శ్రీను పార్టీ మారడం వల్ల జిల్లాలో, ముఖ్యంగా గజపతినగరం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతోందని, అయినప్పటికీ బొత్స నాయకత్వంలోనే ముందుకు సాగుతామని కొందరు నేతలు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఏదేమైనా ఎప్పుడూ గంభీరంగా కనిపించే బొత్స సత్యనారాయణ ఇలా బహిరంగంగా కంటతడి పెట్టడం ఇప్పుడు ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

