Saturday, September 5, 2026 01:37 PM
Saturday, September 5, 2026 01:37 PM

కృష్ణా జలాల పంచాయతీ.. అసలు వాటా ఎంత..? 

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య పాత వివాదమే మరోసారి కొత్త రూపంలో రాజుకుంది. నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకు ఎంత కేటాయించాలి? అందుబాటులో ఉన్న నీటిని ఏ నిష్పత్తిలో పంచాలి? అన్న అంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనలపై వెనక్కి తగ్గలేదు. దీంతో గత సమావేశంలో మొదలైన ప్రతిష్టంభన తాజా భేటీలోనూ కొనసాగింది. ప్రస్తుతం కేఆర్ఎంబీ పరిధిలోని ఉమ్మడి జలాశయాల్లో సుమారు 142 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలంగాణ పేర్కొంది. ఎల్‌నినో పరిస్థితులు, భవిష్యత్ తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని అందుబాటులో ఉన్న జలాలను రెండు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు వాదించారు.

Also Read: బిగ్ బాస్ 10 ఫైనల్ లిస్ట్ ఇదే..!

కానీ ఏపీ మాత్రం గతంలో అమలైన తాత్కాలిక 66:34 నిష్పత్తినే కొనసాగించాలని పట్టుబట్టింది. ఈ ఒక్క అంశమే సమావేశంలో ప్రధాన వివాదంగా మారింది. ఆగస్టు 24న హైదరాబాద్ జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ ఇదే అంశంపై ఇరు రాష్ట్రాలు ఎదురెదురుగా నిలిచాయి. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ అధ్యక్షతన జరిగిన ఆ సమావేశంలో ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి, తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితులు, తాగునీటి అవసరాలను చూపుతూ అక్టోబర్ వరకు 47 టీఎంసీల నీరు అవసరమని ఏపీ కోరింది. తెలంగాణ మాత్రం నీటి లభ్యత, ఇప్పటివరకు జరిగిన వినియోగం, పోతిరెడ్డిపాడు ద్వారా తరలింపులను పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా నీటిని విడుదల చేయరాదని వాదించింది. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సమావేశాన్ని వాయిదా వేశారు. అప్పట్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానంగా తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఏ రాష్ట్రానికి ఎంత అన్నదే తేలలేదు.

గత సమావేశంలో పరిష్కారం కాని సమస్య తాజా సమావేశంలో మరింత తీవ్రరూపం దాల్చింది. తెలంగాణ 50:50 ప్రతిపాదనను ముందుకు తెస్తే, ఏపీ 66:34 నిష్పత్తిపై వెనక్కి తగ్గలేదు. తాగునీటి అవసరాల కోసం 66:34 లెక్కన తమకు 97 టీఎంసీల విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ కోరినట్లు ఆ రాష్ట్ర ఈఎన్సీ వెల్లడించారు. మొత్తం అవసరంగా 104 టీఎంసీల అంశాన్నీ ఏపీ ప్రస్తావించింది. తెలంగాణ మాత్రం తాగునీటి అవసరాలకు తాము సుమారు 200 టీఎంసీల అవసరాన్ని బోర్డు ముందుంచినట్లు తెలిపింది. అందుబాటులో ఉన్న నీరు 142 టీఎంసీలేనని చెబుతున్న సమయంలో ఇరు రాష్ట్రాల డిమాండ్లు అంతకంటే ఎక్కువగా ఉండటంతో సమస్య మరింత సంక్లిష్టంగా మారింది.

Also Read : వివేకా హత్య కేసులో సంచలన ట్విస్ట్‌..!

తెలంగాణ వాదనలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ మsరోసారి కీలకంగా మారింది. ఏపీ ఇప్పటికే పోతిరెడ్డిపాడు తదితర మార్గాల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా భారీగా కృష్ణా జలాలను తరలించిందని తెలంగాణ ఆరోపించింది. అలాంటి వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మళ్లీ 66:34 నిష్పత్తి పేరుతో కేటాయింపులు చేస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నది. రాష్ట్ర అధికారుల వాదన, ఏపీ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరించారు. తమకు అనుమతించిన పరిధిలోనే నీటిని వినియోగించుకున్నామని, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయాలని బోర్డును కోరారు.

తెలంగాణ పోతిరెడ్డిపాడును ప్రస్తావిస్తే.. ఏపీ నాగార్జునసాగర్ జలవిద్యుత్ ఉత్పత్తిని ముందుకు తెచ్చింది. తాగునీటి అవసరాలకు నీటిని సంరక్షించాల్సిన సమయంలో తెలంగాణ ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని డిమాండ్ చేసింది. దీంతో వివాదం కేవలం ‘ఎవరికి ఎంత నీరు?’ అనే దానికే పరిమితం కాకుండా.. ‘ఎవరు ఎంత వాడారు? ఏ అవసరానికి వాడారు?’ అన్న అంశాల చుట్టూ తిరుగుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల పంపిణీలో 66:34 నిష్పత్తి శాశ్వత హక్కుగా నిర్ణయించిన వాటా కాదని తెలంగాణ చాలాకాలంగా వాదిస్తోంది. అది అప్పటి అవసరాల కోసం అంగీకరించిన తాత్కాలిక వర్కింగ్ అరేంజ్‌మెంట్ మాత్రమేనని చెబుతోంది. కేఆర్ఎంబీ 2022-23 వార్షిక నివేదికలోనూ తెలంగాణ 66:34ను కొనసాగించడానికి అభ్యంతరం వ్యక్తం చేసి, కొత్త తాత్కాలిక ఏర్పాటుగా 50:50 కోరిన విషయం నమోదైంది. అందువల్ల 66:34ను ప్రతి సంవత్సరం కొనసాగించడం ద్వారా అదే శాశ్వత సూత్రంగా మారే ప్రమాదముందని తెలంగాణ భావిస్తోంది. ఏపీ మాత్రం ట్రైబ్యునల్ స్థాయిలో తుది నిర్ణయం వచ్చే వరకు గత పద్ధతినే కొనసాగించాలన్న వైఖరిలో ఉంది.

Also Read : పేపర్ మిల్లు మూసేస్తారా.. లేదా..?

ఈ ఏడాది మేలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి కలిపి సుమారు 23 టీఎంసీలు, ఏపీకి నాగార్జునసాగర్ నుంచి 10 టీఎంసీలు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ఆ సమయంలోనూ ఏపీ ఇప్పటికే తన వాటా కంటే అధికంగా నీటిని వినియోగించిందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. అంటే ప్రతి సమావేశంలోనూ అవసరాలకు అనుగుణంగా తాత్కాలిక విడుదలలు జరుగుతున్నా.. అసలు వాటా ఎంత? ఏ నిష్పత్తిని ప్రామాణికంగా తీసుకోవాలి? అన్న మూల సమస్య మాత్రం అలాగే మిగిలిపోతోంది.

కృష్ణా జలాల వివాదంలో అసలు సమస్య ఇక్కడే ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా రెండు రాష్ట్రాల మధ్య తుది జలవాటాల అంశం పూర్తిగా పరిష్కారం కాలేదు. ఫలితంగా ప్రతి నీటి సంవత్సరం ప్రారంభంలో, వర్షాభావ పరిస్థితుల్లో, తాగునీటి అవసరాలు పెరిగినప్పుడల్లా ఇదే వివాదం తిరిగి తెరపైకి వస్తోంది. 66:34ను కొనసాగించాలన్న ఏపీ.. 50:50 తాత్కాలిక పంపిణీ కావాలన్న తెలంగాణ వాదనల మధ్య కేఆర్ఎంబీ ఏకాభిప్రాయం సాధించలేకపోతోంది. దీంతో సాంకేతికంగా పరిష్కరించాల్సిన నీటి పంపిణీ అంశం క్రమంగా రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ అంశంగానూ మారుతోంది.కృష్ణా జలాల పంచాయతీ.. అసలు వాటా ఎంత..?

తాజా సమావేశంలోనూ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సెప్టెంబర్ నాలుగో వారంలో మరోసారి త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికైనా అందుబాటులో ఉండే నీరు, తాగునీటి అవసరాలు, రాష్ట్రాల వినియోగ లెక్కలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారా..? లేక మరోసారి 50:50 – 66:34 దగ్గరే పంచాయితీ ఆగిపోతుందా అన్నది చూడాల్సి ఉంది. ఫలితంగా కృష్ణాలో నీటి ప్రవాహం కంటే.. వాటాల వివాదమే వేడెక్కుతోంది. తాజా భేటీలో 142 టీఎంసీల లభ్యత, తెలంగాణ 50:50 డిమాండ్, ఏపీ 66:34 పట్టు, పోతిరెడ్డిపాడు – సాగర్ విద్యుత్ ఉత్పత్తిపై పరస్పర ఆరోపణలు నమోదయ్యాయి. నిర్ణయం సెప్టెంబర్ నాలుగో వారానికి వాయిదా పడింది. 66:34 అనేది తాత్కాలిక వర్కింగ్ అరేంజ్‌మెంట్ మాత్రమేనని తెలంగాణ గతంలోనే అభ్యంతరం తెలిపింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయి రెడ్డి పార్టీకి...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా తీవ్ర...

తెలంగాణలో రేపే మంత్రివర్గ...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

పేపర్ మిల్లు మూసేస్తారా.....

రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుకు వెంటనే...

వివేకా హత్య కేసులో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

నేను సీఎం అవుతా.....

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రాంతీయ పార్టీ...

ఇంటింటికీ తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం రెండేళ్ల...

పోల్స్