వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు వైసీపీ నేతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు తండ్రి కొడుకులు. ఒకవైపు రాష్ట్ర శాసనసభలో స్పీకర్ స్థానంలో అయ్యన్నపాత్రుడు, మరోవైపు రాజ్యసభలో తనయుడు విజయ్ వైసీపీని ఓ ఆట ఆడుకుంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇప్పటికే వైసీపీ వ్యవహారశైలిపై కొరడా ఝుళిపిస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా, కనీసం హాజరు సంతకాలు పెట్టకుండా తప్పించుకురుగుతున్న ఆ పార్టీ సభ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అంతేకాదు జీతాలు కూడా నిలిపివేస్తామంటూ షాక్ ఇచ్చారు. ఇప్పుడు తండ్రికి తనయుడు తోడయ్యారు. ఎంపీగా అడుగుపెట్టిన చింతకాయల విజయ్..ఏకంగా పార్లమెంట్ వేదికగానే వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు.
Also Read : బీసీలకు ఏపీ సర్కార్ బిగ్ గిఫ్ట్..!
రాజ్యసభ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ జాప్యాన్ని విజయ్ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై జరిగిన చర్చను ఆయన ఇందుకు వాడుకున్నారు. 2013లో జగన్‌పై నమోదైన క్రిమినల్ కేసులు 13 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం న్యాయవ్యవస్థలోని జాప్యానికి అద్దం పడుతోందని విజయ్ తీవ్ర స్థాయిలో ఎత్తిచూపారు.
న్యాయమూర్తుల పెంపు అనేది కేవలం ఒక సంఖ్యకు చేసే సవరణ మాత్రమే కాకూడదని, ప్రతి పెండింగ్ కేసు వెనుక ఒక మానవీయ గాథ ఉంటుందని ఎంపీ విజయ్ విశ్లేషించారు. సకాలంలో న్యాయం చేయడంలో జాప్యం చేస్తే.. దాన్ని తిరస్కరించినట్లే లెక్క అని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. దేశంలో న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని మరింతగా పెంచాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కిచెప్పిన ఆయన.. ప్రజాప్రతినిధుల కేసులు త్వరితగతిన విచారించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు గురించి ఆలోచించాలని సూచిస్తూనే, జగన్ కేసుల సుదీర్ఘ జాప్యాన్ని ప్రస్తావించి జగన్‌కు షాక్ ఇచ్చారు. జగన్‌పై నమోదైన సీబీఐ కేసులను వీలైనంత వేగంగా విచారించి బాధ్యులకు శిక్ష పడేలా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా చర్యలు వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : పార్లమెంట్ లో దుమ్మురేపిన చింతకాయల విజయ్..!
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చింతకాయల కుటుంబాన్ని టార్గెట్ చేసి పెట్టిన ఇబ్బందులు, సాగించిన వేధింపులు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న ఒకే ఒక్క కక్షతో నాడు అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడు విజయ్‌పై కేసులు బనాయించి, అరెస్టులు చేసి వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందారు. తమ గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు పెట్టిన అదే వైసీపీకి.. ఇవాళ చింతకాయల ఫ్యామిలీ వడ్డీతో సహా చెల్లిస్తోంది. నాడు తాము పడిన అవమానాలకు, ఎదుర్కొన్న పోలీసు వేధింపులకు ఏకంగా చట్టసభల వేదికగానే పక్కా పొలిటికల్ రివేంజ్ తీర్చుకుంటోంది.

