కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం ఆశించిన స్థాయిలో ఊపు అందుకోలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మొత్తం 45 రోజుల పాటు ప్రతి ఇంటికీ వెళ్లాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27న ప్రారంభించినప్పటికీ, తొలి రెండు రోజుల్లోనే క్షేత్రస్థాయిలో ఆశించిన ఉత్సాహం కనిపించడం లేదని పార్టీ వర్గాల్లోనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి అనుకూలంగా భావించే మీడియా సంస్థల్లో సైతం ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రచారం లభించకపోవడం చర్చనీయాంశమైంది.
Also Read : టీమిండియాలో షమీ శకం ముగిసినట్లేనా..?
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్థానిక స్థాయిలో కార్యకర్తలు ఎదురుచూసిన పనులు జరగలేదన్న అసంతృప్తి కొంతమందిలో ఉందని, అదే కార్యక్రమంపై ప్రభావం చూపుతోందని ప్రచారం జరుగుతోంది. కార్యకర్తలు, నాయకుల్లో ఆశించిన స్థాయిలో పాల్గొనే ఉత్సాహం కనిపించడం లేదని, కార్యక్రమం కేవలం లాంఛనప్రాయంగా కొనసాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంకా 40 రోజులకు పైగా ఈ కార్యక్రమం కొనసాగాల్సి ఉండటంతో, రానున్న రోజుల్లో పార్టీ దీనికి ఎలా ఊపు తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీలను పక్కనపెట్టి టీడీపీ ఒక్కటే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలను తమ పార్టీ వల్లే అన్నట్లుగా ప్రచారం చేయడంపై ఆ రెండు పార్టీల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వంలో తాము కూడా కీలక భాగస్వాములమేనని, ప్రచార కార్యక్రమాల్లో తమకూ ప్రాధాన్యం ఇవ్వాల్సిందని ఆయా పార్టీల నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయి పర్యవేక్షణపై మరింత దృష్టి అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమం ముందున్న రోజుల్లో ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లి ఆశించిన ఫలితాలు సాధిస్తుందో చూడాల్సి ఉంది.
Also Read : వన్ ఆఫీసర్, వన్ కార్.. ప్రభుత్వ వాహనాలకు కేంద్రం బ్రేక్..!
వాస్తవానికి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సరిగ్గా చివరి ఏడాదిలో “గడప గడపకు మన ప్రభుత్వం” పేరుతో ప్రచారం చేసింది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ నిధులతో నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కూడా వైసీపీ నేతలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లారు. నాలుగున్నరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసిందని, ప్రతి కుటుంబానికి లక్షల రూపాయల లబ్ది జరిగిందని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఓటర్లు మాత్రం.. ప్రభుత్వ పథకాల్లో కోతలను, తమకు జరిగిన అన్యాయాలను పది మందిలో నిలదీశారు. ఈ వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. వైసీపీ మంత్రులను కూడా ప్రజలు నిలదీశారు. దీంతో చాలా చోట్ల వైసీపీ నేతలు గడప గడపకు వెళ్లకుండానే ఇంటి దారి పట్టారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. కూటమి ప్రభుత్వంలోని మిగిలిన బీజేపీ, జనసేన పార్టీలను కూడా టీడీపీ నేతలు కలుపుకుంటూ వెళ్లాలంటున్నారు విశ్లేషకులు.

