కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందగా అందుకు కారణమైన తన కుమారుడిని తప్పించేందుకు కుట్ర చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. పలాస కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత అప్పలరాజును శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో అప్పలరాజు ఏ3గా ఉన్నారు. అంతకు ముందే సీదిరి తనయుడు ఆరవ్ వర్మను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసులో ఒకవైపు తనయుడు బైయిల్ కోసం సీదిరి కుటుంబం న్యాయవాదుల ద్వారా కోర్టులో పిటీషన్స్ వేస్తూన్న సమయంలోనే ముందస్తు బెయిల్ కోసం సీదిరి అప్పలరాజు కూడా పిటిషన్ వేశారు. ఆ బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్నప్పుడే సీదిరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సీదిరి అప్పలరాజు జైలులో రిమాండ్ ఖైదీలా ఉన్నారు.
Also Read : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా..!
అయితే ఇప్పుడు అందరి దృష్టి మరో కీలక నేతపై పడింది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర ఉన్న నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన తమ్మినేని మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలోకి వచ్చినప్పటికీ.. ఆయనను చంద్రబాబు దూరం పెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్మినేని.. సైలెంట్‌గా జగన్ పంచన చేరారు. 2014 ఎన్నికల్లో టికెట్ లేదని ముందే చంద్రబాబు క్లారిటీ ఇవ్వటంతో తన రాజకీయ భవిష్యత్ కోసమే వైసీపీలో చేరారు తప్ప.. అప్పటి వరకు జగన్‌పై ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఓడిన తమ్మినేని.. 2019లో గెలిచారు. మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ.. స్పీకర్‌గా అవకాశం ఇచ్చారు జగన్. ఐదేళ్ల పాటు రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ.. చంద్రబాబు పైన, పవన్ కల్యాణ్ పైన లెక్క లేనన్ని రాజకీయ విమర్శలు, బూతులతో రెచ్చిపోయారు.
Also Read : అధిష్ఠానం నోటీసులపై ఎమ్మెల్యే బోండా ఉమ హాట్ కామెంట్స్..!
2024 ఎన్నికల్లో ఓడిన తమ్మినేని సైలెంట్ అయిపోయారు. జిల్లాలో కూడా ఎక్కడా కనిపించలేదు. సైలెంట్‌గా హైదరాబాద్ మారిపోయారు. అయితే రాజకీయంగా దూరమయ్యారేమో అని అంతా అనుకున్నారు. అయితే అవేవీ కాదని.. భూకబ్జా కేసులకు భయపడి పారిపోయారని ఇటీవలే బయటకు వచ్చింది. శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో భూకబ్జా ఆరోపణలతో నమోదైన కేసులో తమ్మినేని సీతారాం కూడా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికి సీతారం ఎఫ్ఐఆర్ స్క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటీషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. భూకబ్జా ఆరోపణలపై నమోదైన కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. అదే కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు సతీమణి వాణిశ్రీ తనయుడు చింరజీవి నాగ్‌లను పోలీసులు నిందితులుగా చేర్చారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి స్వయంగా ఆ కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. తర్వాత తమ్మినేని సీతారం కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. తమ్మినేని కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read : ప్రభుత్వ బడుల్లో ‘NO ADMISSION’.. లోకేష్ విజన్ ఎఫెక్ట్
సీదిరిపై కేసు నమోదు అయిన తర్వాత కూడా ఆయనను అరెస్టు చేసే విషయంలో పోలీసులు తర్జనభర్జనలు పడ్డారు. అప్పలరాజుపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగించారు. ఆయన ఇంటి వద్ద అలాగే అప్పలరాజు శ్రీకాకుళం వచ్చి బస చేసిన ప్రైవేటు గెస్ట్ హౌస్ వద్ద కూడా పోలీసులు నిఘా పెట్టారు. తనపై నమోదైన కేసులో సీదిరి అప్పలరాజు ముందస్తు బెయిల్‌కి ప్రయత్నిస్తున్న విషయం పోలీసులకు తెలిసినా ఆయనను ఫాలో అవుతూనే ఉన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారంలపై కేసులు వరుసగా నమోదైన వేళ చట్టప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూటమి ప్రభుత్వంలోని పెద్దలు వెల్లడించారు. ఆయా కేసుల్లో ఇతర నిందితులను అరెస్టు చేసి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంలను అరెస్టు చేయడంలో తాత్సారం చేయడంపై పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి కూడా. దీంతో పోలీసులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేసారు.
తమ్మినేని సీతారం ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగింది. ఈ సమయంలో తమ్మినేనికి ఆయన కుటుంబ సభ్యులకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని వారి తరపున సీనియర్ న్యాయవాది వాదనలను వినిపించగా ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని పీపీ గట్టిగా వాదనలను వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేస్తూ నిర్ణయాన్ని వాయిదా వేశారు. తీర్పు గడువు ఉండడంతో ఈలోగా తమ్మినేనిని పోలీసులు అరెస్టు చేస్తారా అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. సీదిరి లాగా తమ్మినేని సీతారాంను కూడా అరెస్టు చేయవచ్చనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాలలో నెలకొంది.

