అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశపడే హెచ్-1బీ వీసా పిటిషనర్లు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ బిగ్ షాక్ ఇచ్చింది. వీసా, గ్రీన్ కార్డ్ అప్లికేషన్లలో జరిగే తప్పులను అరికట్టేందుకు రేపటి నుంచి అంటే జూలై 10 నుంచి సంతకాలకు సంబంధించి సరికొత్త, కఠినమైన రూల్స్ ను అమలు చేయబోతోంది. కొత్త పాలసీ ప్రకారం.. దరఖాస్తులపై చెల్లని లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉండే సంతకాలు ఉంటే, ఆ అప్లికేషన్లను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే అధికారులు పూర్తిగా తిరస్కరిస్తారు.
Also Read : ఫౌజీ సెట్ లో అసలేం జరిగింది..?
ఈ సరికొత్త నిబంధనల ప్రకారం.. దరఖాస్తుదారులు కేవలం పెన్నుతో స్వయంగా చేసిన చేతిరాత సంతకాలను మాత్రమే యూఎస్‌సీఐఎస్ అంగీకరిస్తుంది. ఒకవేళ ఆన్‌లైన్ లేదా ఫిజికల్ ఫామ్స్ సబ్మిట్ చేస్తుంటే.. ఒరిజినల్ చేతిరాత సంతకం ఉన్న పేజీని స్కాన్ లేదా ఫ్యాక్స్ చేసి అప్లోడ్ చేయవచ్చు. అయితే, కంప్యూటర్లలో టైప్ చేసిన పేర్లు, ఆటో-జనరేటెడ్ డిజిటల్ సాఫ్ట్‌వేర్ సంతకాలు, స్టాంపులు లేదా కాపీ-పేస్ట్ చేసిన సంతకాలను అధికారులు ఏమాత్రం ఒప్పుకోరు. దరఖాస్తుదారుల తరపున లాయర్లు లేదా ప్రతినిధులు సంతకాలు పెట్టినా అవి చెల్లవు.
Also Read : ముందు రావణ్.. తర్వాత ఆయనే..!
సాధారణంగా దరఖాస్తులలో ఏవైనా చిన్న తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు గతంలో సమయం ఇచ్చేవారు. కానీ, ఈ కొత్త రూల్ ప్రకారం సంతకంలో లోపం ఉంటే అప్లికేషన్ ను నేరుగా రిజెక్ట్ చేసి దరఖాస్తుదారుడికే తిప్పి పంపుతారు. మళ్లీ మొదటి నుంచి ఫీజు చెల్లించి, సరైన సంతకంతో కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి, దరఖాస్తుదారుల గుర్తింపును పక్కాగా ధృవీకరించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.

