ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది మునుపెన్నడూ లేని విధంగా జలకళను సంతరించుకుంది. దేవిపట్నం మండలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం గండి పోచమ్మ ఆలయాన్ని గోదారమ్మ తాకింది. అమ్మవారి పాదాలను తాకుతూ వరద నీరు ప్రవహిస్తుండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అటు ధవలేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం నిరంతరాయంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ గేట్లను ఎత్తి అదనపు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Also Read : మీ కొలెస్ట్రాల్ టెస్ట్ సరైనదేనా..?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. సాగు నీరు దేవుడెరుగు, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక అనేక ప్రాంతాలు కరవు ఛాయలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి గడ్డు కాలంలో గోదావరికి వచ్చిన ఈ వరద నీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఒక పెద్ద ఆశాకిరణంగా మారింది. సముద్రంలోకి వృథాగా పోయే ఈ జలాలను సద్వినియోగం చేసుకునే సమయం ఆసన్నమైంది. ఈ కరవు పరిస్థితుల్లో గోదావరి వరద నీరు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు తరలిరానుంది.
Also Read : వైసీపీలో చీలిక ఖాయమేనా..?
ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని పట్టిసీమ పంపుల ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాలు లేక ఎండిపోతున్న కృష్ణా డెల్టాలోని లక్షలాది ఎకరాల పంట పొలాలకు ఈ నీరు ప్రాణాధారంగా మారబోతోంది. నిరుత్సాహంలో ఉన్న రైతుల్లో ఈ వార్త కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఒక్కసారి ఆలోచిస్తే.. ఒకవేళ ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు లేకపోయి ఉంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో ఊహించుకోవడానికే భయమేస్తుందని రైతులు చెప్పుకొస్తున్నారు.. గోదావరికి వచ్చిన ఇంతటి భారీ వరద నీరంతా ధవలేశ్వరం దాటుకుని వృథాగా సముద్రం పాలయ్యేది. అటు కృష్ణా డెల్టాలో వర్షాలు లేక, ప్రాజెక్టుల్లో నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాల్లో మునిగిపోయేవారు. నదుల అనుసంధానంలో భాగంగా తెచ్చిన పట్టిసీమ వల్లే ఈరోజు సముద్రంలో కలవాల్సిన నీటితో కృష్ణా డెల్టాను రక్షించుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది.

