ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ప్రాజెక్టుల కేటాయింపులు, టెండర్ల ప్రక్రియ ఇప్పుడు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవర్ ప్రాజెక్టుల కేటాయింపుల వెనుక పెద్ద ఎత్తున పవర్ ఫుల్ గేమ్స్ నడుస్తున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాల్సిన పోటీ బిడ్డింగ్ ప్రక్రియ కేవలం నామమాత్రంగానే సాగుతోందని, టెండర్లు అధికారికంగా పిలవడానికి ముందే ఏ కాంట్రాక్టర్ కు ఏ ప్రాజెక్టు దక్కాలో తెరవెనుక ముందే ఖరారైపోతోందంటూ పారిశ్రామిక వర్గాలు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
Also Read : భవిష్యత్ ఏపీ కోసం బాబు భారీ ప్రణాళిక..!
రాష్ట్రంలో దాదాపు 20,000 మెగావాట్లకు పైగా సామర్థ్యం ఉన్న భారీ విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపుల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా ప్రశ్నలకు తావిస్తోంది. ఒకే ఒక పెద్ద బిజినెస్ గ్రూప్ కు చెందిన కొన్ని అనుబంధ సంస్థలకే వరుసబెట్టి ఈ భారీ ప్రాజెక్టులన్నింటినీ కట్టబెట్టారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కుసుమ్, మెగా సోలార్ పవర్ ప్రాజెక్టులు, మరియు అత్యంత కీలకమైన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కేటాయింపుల వెనుక పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ భారీ ప్రాజెక్టుల అనుమతులు మరియు కేటాయింపుల ప్రక్రియలో కొందరు కీలక మధ్యవర్తులు చక్రం తిప్పారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. విద్యుత్ శాఖ తీసుకుంటున్న కీలక నిర్ణయాలలో, టెండర్ల కండిషన్ల రూపకల్పనలో కొందరు ఉన్నతాధికారుల ప్రభావం అసాధారణంగా పెరిగిపోయిందని, ఒక నిర్దిష్ట కంపెనీకి మాత్రమే లబ్ధి చేకూరేలా టెండర్ నిబంధనలను మార్చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాలు టెండర్ల ప్రక్రియలో ఉండాల్సిన కనీస పారదర్శకతను పూర్తిగా ప్రశ్నార్థకం చేశాయి.
Also Read : భవిష్యత్ ఏపీ కోసం బాబు భారీ ప్రణాళిక..!
విద్యుత్ ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు ఈ టెండర్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించారా లేదా..? ఒకే సంస్థకు ఇన్ని వేల మెగావాట్ల ప్రాజెక్టులు ఎలా దక్కాయి..? అనే అంశాలపై నిష్పాక్షికంగా సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచితేనే విద్యుత్ శాఖపై నమ్మకం నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

