ఏపీలో ఎన్నికలు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీ లక్ష్యం టార్గెట్ 2029 అన్నట్లుగా సాగుతోంది. వచ్చే ఏడాది జూన్ నెల నుంచి పాదయాత్ర చేయాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అదే సమయంలో కూటమి పార్టీల నేతలు కూడా రాబోయే ఎన్నికలపై దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ర్యాంకులు ఇస్తూ.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అటు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇప్పటి నుంచే పోటీ చేసే అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు.
Also Read : సునీల్ కుమార్ రిటైర్మెంట్ వేడుకలు.. పొలిటికల్ ఎంట్రీపై రేపే ప్రకటన..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు ముందు చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను చివరి నిమిషంలో మార్చేశారు. కొన్ని చోట్ల కొత్త వారిని పోటీలో నిలబెట్టారు. మార్పుల వల్ల అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. చివరికి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఇలాంటి తప్పు మరోసారి జరగకూడదని ముందు నుంచే జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉన్నప్పటికీ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారు. ముందుగా కూటమి పార్టీలు తమ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నాయి. అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ప్రకటించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై ఆ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు విడదీయరాని బంధం ఉంది. 1978లో తొలిసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి అయ్యారు. చంద్రగిరి నియోజకవర్గం చంద్రబాబు రాజకీయ పుట్టిల్లు. ఆ తర్వాత నుంచి ఆయన కుప్పం నియోజకవర్గానికి మారారు. అయినా సరే.. 1994లో చంద్రగిరి నుంచి ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి పులవర్తి నాని 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
Also Read : దువ్వాడ మిస్సింగ్.. దివ్వెల షాక్..!
అయితే 2029 ఎన్నికల్లో పులవర్తి నానికి బదులుగా.. కొత్త అభ్యర్థిని చంద్రగిరి నుంచి రంగంలోకి దింపేందుకు గ్రౌండ్ క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పులవర్తి నాని పై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తాజాగా తిరుపతి రూరల్ మండలంలో వంద కోట్ల విలువైన 3 ఎకరాల భూమి కబ్జా చేసినట్లు ఆయనపై కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. రిటైర్డ్ ఆర్టీవో ద్వారకానాథ్ రెడ్డి భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రగిరి నుంచి నానిని తప్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో నాని బదులుగా నారా ఫ్యామిలీ నుంచి రామ్మూర్తి నాయుడు కుమారుడు, సినీ నటుడు నారా రోహిత్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై నారా లోకేష్ కూడా రోహిత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు నియోజకవర్గంలో పర్యటించాలని సూచించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో నాని అవుట్.. రోహిత్ ఇన్.. అనే మాట బాగా వినిపిస్తోంది.

