వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భూ అక్రమాలు తిరుపతిలో కలకలం రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో తన రాజకీయ అధికారాన్ని, అంగబలాన్ని అడ్డుపెట్టుకుని ఆయన విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం జరిపిన దర్యాప్తులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలను తుంగలో తొక్కి విలువైన ప్రభుత్వ, ఇనాం భూములను ఆయన ఆక్రమించుకున్నట్లు దర్యాప్తులో ఆధారాలతో సహా తేలింది.
Also Read : ముగ్గురు సీఎంల చారిత్రాత్మక భేటీ.. తుంగభద్ర వేదికగా సరికొత్త రాజకీయం..!
విజిలెన్స్ నివేదిక ప్రకారం.. తిరుచానూరు పరిధిలోని సర్వే నంబర్ 474/1Aలో ఉన్న సుమారు 9 ఎకరాల విలువైన ఇనాం భూమిని భూమన కరుణాకర్ రెడ్డి అక్రమంగా కబ్జా చేశారు. కేవలం భూమినే కాకుండా, ఆ పక్కనే ప్రవహించే పవిత్ర స్వర్ణముఖి నదీ ప్రవాహ ప్రాంతాన్ని సైతం ఆయన వదల్లేదు. నది ప్రవహించే పరివాహక ప్రాంతాన్ని భారీగా మట్టితో పూడ్చివేసి, నదిని కూడా ఆక్రమించేశారని అధికారులు గుర్తించారు. ఈ విధంగా భూమన కబ్జా చేసిన మొత్తం భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.45 కోట్ల పైమాటే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ కబ్జా భూమికి రోడ్డు మార్గం ఏర్పరచుకోవడం కోసం భూమన కరుణాకర్ రెడ్డి తన పక్క భూమి యజమాని అయిన ప్రసాద్ అనే వ్యక్తిని తీవ్రంగా బెదిరించినట్లు దర్యాప్తులో తేలింది. భూమన బెదిరింపులకు భయపడకుండా బాధితుడు ప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదంపై సుదీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు, బాధితుడు ప్రసాద్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. రాజకీయ బలంతో అన్యాయంగా భూములు లాక్కోవాలని చూడటంపై ఆగ్రహం వ్యక్తమైంది.
Also Read : గ్రీన్ కార్డ్ హోల్డర్లకు యూఎస్ సుప్రీంకోర్టు షాక్..!
కోర్టు తీర్పు మరియు క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం విజిలెన్స్ విభాగం ఈ భూబాగోతంపై ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించడం, ఇనాం భూములను కబ్జా చేయడం మరియు పౌరులను బెదిరించడం వంటి తీవ్రమైన ఆరోపణల కింద భూమన కరుణాకర్ రెడ్డిపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. విజిలెన్స్ సిఫారసులతో భూమనపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

