Wednesday, June 24, 2026 06:12 PM
Wednesday, June 24, 2026 06:12 PM

కోనసీమలో రైలు కూత ఎప్పుడు వినిపిస్తుంది..?

కోనసీమలో రైలు కూత వినిపించాలని అక్కడి ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆ కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. చిన్నప్పటి నుంచి “త్వరలో కోనసీమకు రైలు వస్తుంది” అని వింటూ పెరిగిన ఎంతోమంది ఇప్పుడు వృద్ధులయ్యారు. కొందరు ఈ లోకాన్ని కూడా విడిచిపెట్టారు. కానీ కోనసీమ నేలపై ఇప్పటికీ రైలు కూత వినిపించలేదు. నిజానికి కోనసీమకు రైలు కనెక్టివిటీ కల్పించాలనే ఆలోచన కొత్తది కాదు. బ్రిటిష్ పాలనా కాలంలోనే దీనిని ప్రతిపాదించారు. ఆ సమయంలో కాకినాడ – కోటిపల్లి మధ్య రైల్వే మార్గాన్ని కూడా నిర్మించారు. అయితే కోటిపల్లి నుంచి ముందుకు రైల్వే లైన్ పొడిగించాలంటే గోదావరి నదికి చెందిన మూడు ప్రధాన పాయలపై భారీ వంతెనలు నిర్మించాల్సి వచ్చింది. దీంతో ఆ ప్రాజెక్టు అక్కడితో నిలిచిపోయింది.

Also Read : కిమ్ జోంగ్ ఉన్ మెంటల్ మాస్ నిర్ణయం..!

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కోనసీమ ప్రజల ఆశ మాత్రం మారలేదు. కోనసీమ మీదుగా రైల్వే లైన్ నిర్మించాలని నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక రైల్వే మార్గం కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు. అది ఒక ప్రాంత అభివృద్ధికి, పరిశ్రమలు రావడానికి, పర్యాటకం పెరగడానికి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటానికి, ప్రయాణ ఖర్చులు తగ్గడానికి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది.

ఎట్టకేలకు కోనసీమ ప్రాంతానికి చెందిన లోక్‌సభ మాజీ స్పీకర్, దివంగత జీఎంసీ బాలయోగి కృషితో కాకినాడ – కోటిపల్లి – నరసాపురం రైల్వే ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేశారు. ఈ మార్గంలో రైల్‌ బస్ సేవలు కూడా ప్రారంభించారు. కానీ దురదృష్టవశాత్తు బాలయోగి అకాల మరణం తర్వాత ఈ ప్రాజెక్టు వేగం తగ్గిపోయింది. కోటిపల్లి నుంచి నరసాపురం వరకు నిర్మించాల్సిన అత్యంత కీలకమైన భాగం ఇంకా నత్తనడకన సాగుతోంది. పనులు పూర్తిగా ఆగిపోయాయని కాదు. గోదావరి నదిలోని పాయలపై వంతెనలకు అవసరమైన స్తంభాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. కానీ ఆ తర్వాత పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు.

రైల్వే లైన్ నిర్మాణం ఆగిపోవడానికి ప్రధాన కారణం నిధుల కొరత. ఈ ప్రాజెక్టును ఆమోదించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చును భరించాలని నిర్ణయించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు బలహీనపడటంతో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సమకూర్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం నెమ్మదించింది. ఈ ప్రాజెక్టు పరిస్థితి “పెద్ది” సినిమాలోని ఒక సన్నివేశాన్ని గుర్తుకు తెస్తుంది. ఆ సినిమాలో జగపతి బాబు తన ఊరిలో రైళ్లు ఆగాలని కలలు కంటూ రైల్వే ట్రాక్ పక్కన నిలబడి ఎర్రజెండా ఊపుతూ ఉంటాడు. నాయకులను కలుస్తాడు, అవమానాలు భరిస్తాడు. కానీ అతని కోరిక నెరవేరదు. చివరకు తన ప్రాణాలను కూడా త్యాగం చేస్తాడు.

Also Read : సొంత గూటికి రిషభ్ పంత్.. ఎంత లాస్ అంటే..!

ఒక ప్రాంతానికి రైలు కనెక్టివిటీ ఎంత అవసరమో ఆ సన్నివేశం తెలియజేస్తుంది. కోనసీమ ప్రజల పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. ఈ ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ వస్తే తమ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందని, తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం లభిస్తుందని వారు భావిస్తున్నారు. ఎంతోమంది చిన్నప్పటి నుంచి రైలు కోసం ఎదురుచూస్తూ పెద్దవారయ్యారు. తరాలు మారాయి. ప్రభుత్వాలు మారాయి. కానీ కోనసీమలో రైలు కూత మాత్రం ఇంకా వినిపించలేదు. ఈ రైల్వే మార్గం పూర్తయితే కోనసీమకు ప్రత్యక్ష రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం కోనసీమ ప్రజలు నరసాపురం, పాలకొల్లు లేదా కాకినాడకు వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తోంది.

ఈ ప్రాజెక్టు పూర్తయితే పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు సులభంగా తరలించే అవకాశం ఏర్పడుతుంది. విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే కోనసీమ ప్రాంతం భారతీయ రైల్వే మ్యాప్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. నరసాపురం – కోటిపల్లి – కాకినాడ రైలు మార్గం అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విజయవాడ – ఏలూరు- నిడదవోలు, విజయవాడ – గుడివాడ – భీమవరం – నిడదవోలు మార్గాలపై ఒత్తిడి భారీగా తగ్గుతుంది. నరసాపురం – కోటిపల్లి – కాకినాడ.. ఇది కేవలం ఒక రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది లక్షలాది కోనసీమ ప్రజల దశాబ్దాల కల. ఆ కల ఎప్పుడు సాకారం అవుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సీఐ నాగరాజు రిమాండ్...

విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె...

నేనే చేసానని గ్యారెంటీ...

ఆంధ్రప్రదేశ్‌ లో తీవ్ర సంచలనం సృష్టించిన...

రేవంత్ సర్కార్ దెబ్బకు...

గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి,...

కాపులకు జగన్ నమ్మకద్రోహం.....

ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో ఎన్నో...

సాయికృష్ణ అదృశ్యం కేసులో...

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ...

కూటమి సర్కార్ ప్రోగ్రెస్...

ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి...

పోల్స్