జనాభా ఆధారిత డీలిమిటేషన్ ఫార్ములాను దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా యి. జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసి, దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు తమకు సీట్లను తగ్గించి శిక్షిస్తారా? అని చంద్రబాబు నాయుడు, స్టాలిన్ వంటి నేతలు ఇప్పటికే బహిరంగంగానే ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం 50 శాతం పెంపు ఫార్ములాను మొండిగా ముందుకు తీసుకెళ్తే దక్షిణాది పార్టీలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి. అయితే, ఒకవేళ ప్రధాని ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించిన ‘టార్గెటెడ్ అండ్ వెయిటెడ్’ పద్ధతిని ప్రవేశపెట్టి.. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తే మాత్రం దక్షిణాది పార్టీలు ఆ ఫార్ములాకు ఓటేసే అవకాశం ఉందని భావిస్తున్నా రు.
మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారినప్పటికీ, అది అమలు కావాలంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తికావడం సాంకేతికంగా అత్యంత కీలకం. ఉత్తరాదిలోని ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలు కోటాలోకోటా కింద ఓబీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ బిల్లు, ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లు రెండింటికీ పార్లమెంటరీ ఆమోదం పొందాలని ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. డిలిమిటేషన్ బిల్లును ఆమోదింపచేయడానికి ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నానికి పార్లమెంట్‌లో అవసరమైన మద్దతు లభించకపోవడంతో ఈ అంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది.
Also read : పవన్ టార్గెట్ అదేనా.. అక్కడ కూడా రాణిస్తారా..?
అయితే, పార్లమెంట్‌లో ఎన్డీఏ బలం పెరుగుతున్న తరుణంలో, మహిళా ఓటర్ల మద్దతును పూర్తిగా స్వంతం చేసుకోవడానికి కేంద్రం ఈ రెండు బిల్లులను ఒకేసారి ముడిపెట్టి ఆమోదించే వ్యూహంతో ముందుకు వెళ్లోంది. రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ చర్చ కేవలం సీట్ల సంఖ్యకు పరిమితం కాకుండా.. భారతదేశ సమాఖ్య స్ఫూర్తికి ఒక పెద్ద పరీక్షగా మారబోతోంది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో లభించిన 2/3 వంతు మెజార్టీతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందా, లేదా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక సలహా మండలి సూచించిన సమతుల్య ఫార్ములా వైపు మొగ్గు చూపుతుందా అనేది తేలాల్సి ఉంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి.
గతంలో ఎన్డీఏ కూటమికి పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీ లేకపోవడం వల్ల ఈ రాజ్యాంగ సవరణల ప్రక్రియ సాధ్యం కాదనే చర్చ నడిచింది. అయితే, లోక్‌సభలో అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన సుమారు 20 మంది ఎంపీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం, ఇండియా కూటమిలోని సమాజ్ వాదీ పార్టీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ కోసం సానుకూల సంకేతాలు ఇస్తుండటంతో మోదీ – షా ద్వయానికి అవసరమైన సంఖ్యాబలం సమకూరుతున్నట్లు స్పష్టమవుతోంది. అసలు డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన జరగబోతోంది..? దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు ఏంటి..? ఈ ఫార్ములా ప్రకారం.. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్ల సంఖ్యను నేరుగా దాదాపు 50 శాతం పెంచుతారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని కూడా ఇదే సంఖ్యాబలానికి అనుగుణంగా నిర్మించారు.
కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే, జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరుగుతాయి. ఇటీవల పలు రాష్ట్రా ల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారిపోయాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ – డీఎంకే కూటమి విచ్ఛిన్నమైంది. బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు డీఎంకేను సంప్రదించే ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్‌లోని పరిణామాలను కూడా నిశితంగా గమనిస్తున్నారు. ఒకవేళ గణనీయ సంఖ్యలో ఎంపీలు టీఎంసీ నుంచి విడిపోతే అది పార్లమెంటరీ సమీకరణాలను మార్చేసి బిల్లు ఆమోదానికి అవసరమైన మద్దతును కూడగట్టడంలో ప్రభుత్వానికి సులభతరం చేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Also read : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరున్నారు..?
గతంలో డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు దాని ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైంది. అంటే బిల్లుకు అనుకూలంగా 361 ఓట్లు అవసరం. అయితే బిల్లుకు 298 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. బిల్లుకు వ్యతిరేకం గా 230 మంది ఎంపీలు ఓటు వేశాడు. ఫలితంగా బిల్లుకు అవసరమైన సంఖ్యాబలం లేక సభలో వీగిపోయింది. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే దేశ సమగ్రతకు, సమాఖ్య స్ఫూర్తికి నష్టం వాటిల్లుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించింది. కేవలం జనాభాయే కాకుండా.. భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక వృద్ధి, అక్షరాస్యత వంటి వివిధ సూచీలను పరిగ ణనలోకి తీసుకుని ‘టార్గెటెడ్ నియోజకవర్గాల ‘విభజన’ చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల ఉత్తరాదికి సీట్లు పెరిగినప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు మరీ ఘోరంగా నష్టపోకుండా ఒక సమతుల్యత సాధ్యమవుతుంది.

