కేశినేని బ్రదర్స్ మధ్య ఆర్థిక ఆరోపణల వార్ తారాస్థాయికి చేరుకుంది. విజయవాడ మాజీ, తాజా ఎంపీలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆర్థిక ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎంపీ కేశినేని చిన్ని ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేయాలంటూ మాజీ ఎంపీ కేశినేని నాని బహిరంగ లేఖ రాయడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నాని ఎక్కడున్నారనే చర్చ ఇప్పుడు జోరాగు జరుగుతోంది. మాజీ ఎంపీ కేశినేని నానికి అత్యంత సన్నిహితులుగా భావించే తాతినేని రాంబాబు, కాట్రగడ్డ హేమంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నారనే ప్రచారం విజయవాడలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేశినేని గ్రూప్‌నకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు రుణాల వ్యవహారాలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరి ఆచూకీపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Also Read : లోకేష్ ని హీరోని చేస్తున్న జగన్ అండ్ కో..!
గతంలో కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న కేశినేని నాని తన బాధ్యతల నుంచి తప్పుకుని, తన అనుచరులను డైరెక్టర్లుగా నియమించడం వెనుక ఉద్దేశాలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం, తాతినేని రాంబాబు విచారణకు పూర్తిగా సహకరించడం లేదని, ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో పలుమార్లు వివరాలు సేకరించే ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు రాంబాబు, హేమంత్‌లు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడుల కారణంగా కనిపించకుండా వెళ్లిపోయారనే పుకార్లు కూడా ఇప్పుడు విజయవాడలో పెద్ద దుమారం రేపుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై వారి నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
ఇదిలా ఉండగా, పోలీసులు విచారణకు వచ్చిన ప్రతిసారీ.. దానిని పోలీసుల వేధింపులుగా చిత్రీకరిస్తూ మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫోన్లను పోలీసులకు అప్పగించిన తర్వాత సంబంధిత వ్యక్తులు ఎటు వెళ్లారన్న అంశం కూడా ప్రశ్నార్థకంగా మారింది. కంపెనీ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుని, తన అనుచరులను ఆ స్థానాల్లో ఉంచడం ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలన్నింటిపైనా సంబంధిత వ్యక్తుల అధికారిక వివరణ రావాల్సి ఉంది. అయితే ఈ విషయాలపై వారి నుంచి వివరణ తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.
Also Read : గోదావరి – బనకచర్లకు సంపూర్ణ మద్దతు..!
ఇటీవల సోషల్ మీడియా వేదికగా మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్ కూడా ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబుపై తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని, ప్రస్తుత ఎంపీ చిన్ని ప్రేరణతో పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాంబాబు ఇంటికి వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయన తల్లిని సైతం వేధించారని ట్వీట్‌లో ఆరోపిస్తూ.. రాజకీయ కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. అయితే ఇదే సమయంలో రాంబాబు, హేమంత్‌ల ఆచూకీపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో, విచారణను రాజకీయ వేధింపులుగా చిత్రీకరిస్తూ అసలు అంశం నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

