వేల కోట్ల మద్యం కుంభకోణం, రవాణా స్కాంలో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో కింగ్ పిన్, గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారు రాజ్ కెసిరెడ్డి, బేవరేజస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డి.వాసుదేవ రెడ్డిని హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో సోదాలు నిర్వహించింది. మద్యం రవాణా, కుంభకోణం కేసుల్లో మనీలాండరింగ్ కోణంలో రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరికీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Also Read : ప్లీజ్.. మిమ్మల్ని వదిలేయమంటున్న మహేష్..!
మద్యం రవాణా టెండర్లు, అక్రమాలపై ఏపీ సిట్ నమోదు చేసిన మరో కేసు ఆధారంగా తాజాగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌తో పాటు 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, ఆయన బంధువు నర్సింహారెడ్డిల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లో రాజ్ కెసిరెడ్డిని అదువులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించి నిశితంగా ప్రశ్నించారు. ఫిలింనగర్‌లోని మాజీ మంత్రి ఇంట్లో దాదాపు ఆరున్నర గంటలు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాసుదేవ రెడ్డి, కోకాపేటలోని ఆయన బంధువు విజయ్ నర్సింహరెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో ఈడీ అధికారులు పలు కీలక ఆధారాలు, ఎలక్ట్రానిక్, డిజిటల్ సాక్ష్యాధారాలు సేకరించారు.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అధిక ధరలకు ముందస్తుగా నిర్ణయించిన సంస్థలకు మద్యం రవాణా టెండర్లు వాసుదేవరెడ్డి కట్టబెట్టారని ఈడీ అధికారులు గుర్తించారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.349 కోట్ల నష్టం జరిగిందని, వానుదేవరెడ్డి బినామీ బాతాలకు కోట్లాది రూపాయల డబ్బు మరలినట్లు ఈడీ అధికారుల విచారణలో వెల్లడైందని తెలుస్తోంది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం.. మద్యం రవాణాకు సంబంధించి న్యూఢిల్లీకి చెందిన సిగ్మా కంపెనీని తెర ముందు పెట్టి వాసుదేవరెడ్డి నేతృత్వంలో కొన్ని బినామీ సంస్థల ద్వారా వ్యవహరాలు నడిపారు. ఇందులో సుదర్శన్ ఫర్మ్ యజమాని సంధ్యకు రూ.68 కోట్ల లాభం కలిగింది. ఇందులో నుంచి కారుమూరి కుటుంబానికి రూ.15 కోట్లు సగదు రూపంలో చెల్లించారు. ఢిల్లీ కంపెనీ పేరును వాడుకున్నందుకు కేవలం ఆ కంపెనీకి మొత్తం బిల్లింగ్‌లో నాలుగు శాతం కమీషన్ ఇచ్చారు. 96 శాతం మొత్తాలను రవాణా సిండికేట్ షెల్ కంపెనీలు, హవాలా రూపంలో చేతులు మార్చింది.
మద్యం అక్రమ రవాణా విషయంలో అప్పట్లో డిప్యుటేషన్‌పై ఏపీలో పనిచేసిన ఒక ఐపీఎస్ అధికారి బినామీ కంపెనీ పాత్ర సైతం ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సదరు ఐపీఎస్ అధికారి బినామీ కంపెనీకి సంబంధించిన వ్యక్తులను ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. త్వరలో ఆయా వ్యక్తులకు ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు దాదాపు రూ.400 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. భారతీయ రైల్వేలో రైల్వే ట్రాఫిక్ సర్వీసు అధికారిగా ఉన్న వానుదేవరెడ్డిని నాటి వైసీపీ ప్రభుత్వం డిప్యుటేషన్‌పై తీసుకొచ్చింది. కీలక వదవిలో కూర్చోపెట్టింది. మద్యం ఆర్డర్‌లకు సంబంధించి ప్రతి కేసుకు రూ.200 నుంచి రూ.250 వరకు కమీషన్ రూపంలో ఆయన తీసుకున్నట్లు ఈడీ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బుతో దాదాపు రూ.800 కోట్ల బంగారం కొన్నారన్న విషయాలపైనా ఈడీ అధికారులు నిశితంగా విచారణ చేస్తున్నారు. కాగా, మద్యం స్కామ్‌కు సంబంధించి సిట్ అధికారులు రాజ్ కెసిరెడ్డి సహా 33మంది నిందితులపై కేసు నమోదు చేశారు.
Also Read : కేంద్ర మంత్రివర్గంలో జనసేన.. ఆయనే ఫైనల్..!
రాజ్ కసిరెడ్డి ప్రతినెల రూ.60 కోట్ల మద్యం ముడుపులను స్వీకరించారని ఈడీ అధికారులు రిమాండ్ నోట్‌లో పేర్కొన్నారు., 2019 నుంచే ముడుపుల ప్రవాహం ప్రారంభమైందని, దాదాపు రూ.3,200 కోట్ల ముడువులు చేతులు మారాయని, హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీలోని హవాలా ఆపరేటర్లు, షెల్ కంపెనీల ద్వారా డబ్బు ఎక్కువగా మార్పిడి జరిగిందని, ముడుపుల సొమ్ములో కొంత భాగాన్ని హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రా రంగంలో పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. అలాగే బంగారం కొనుగోలుకు ఆధారాలు ఉన్నాయని, ఈ బంగారం గుట్టలు ఎక్కడున్నాయో త్వరలో బయటపడే అవకాశాలున్నాయని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు.
దాదాపు రూ.3,200 కోట్ల ముడువులు షెల్ కంపెనీలు, హవాలా మార్గాలు, బంగారం, నగదు రూపేణా చెలామణి అయిన క్రమంలో ఈడీ అధికారులు కీలక విషయం వైపు దృష్టి సారిస్తున్నారు. మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది? ఎవరెవరి నుంచి డబ్బు ఎటు వెళ్లింది? అంతిమంగా ఈ కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు డబ్బు ఎలా చేరిందన్న అంశాలపై ఈడీ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తాజా అరెస్టుల నేపథ్యంలో త్వరలో అంతిమ లబ్దిదారును ఈడీ అధికారులు విచారణకు పిలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

