సినిమాల్లో హీరోగా మెప్పించడం ఒక విషయం అయితే, నిజ జీవితంలో హీరోగా నిలవడం మరో విషయం. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న స్టార్ అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రముఖ హాస్యనటుడు సత్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల హృదయాలను తాకుతున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో సత్య మాట్లాడుతూ రామ్ చరణ్ మానవత్వం, నిరాడంబరత, సహాయ గుణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తాను కూడా ఒకప్పుడు చరణ్ నుంచి ఆర్థిక సాయం పొందిన విషయాన్ని తొలిసారి వెల్లడించారు. “ఆయన దగ్గర నేను కూడా హెల్ప్ తీసుకున్నవాడినే” అంటూ సత్య చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రామ్ చరణ్ ఎలాంటి ప్రచారం లేకుండా తనకు సహాయం చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు.
Also Read : జాన్వీ.. గ్లామర్ రోల్స్ కే పరిమితమా..?
అంతేకాదు, తనకే కాదు ఎంతోమందికి చరణ్ నిశ్శబ్దంగా అండగా నిలుస్తుంటారని సత్య తెలిపారు. చేసిన సహాయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పుకోరని, ప్రచారం కోసం ఒక్క అడుగు కూడా వేయరని అన్నారు. ఈ విషయంలో ఆయన తత్వం పవన్ కళ్యాణ్‌ను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. “చరణ్ చేసే దానాలు, సహాయాలు బయటకు వచ్చేవి చాలా తక్కువ. సహాయం పొందినవాళ్లు కూడా వాటిని బయటపెట్టరు. కానీ ఆయన ఎప్పుడైనా, ఎవరికైనా అవసరం వస్తే వెంటనే స్పందిస్తారు” అని సత్య ప్రశంసించారు.
రామ్ చరణ్ నిరాడంబరతకు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను కూడా ఆయన పంచుకున్నారు. ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేదని చెప్పారు. “లుంగీ కట్టుకుని మామూలు వ్యక్తిలా అందరితో కలిసి కూర్చునేవారు. మాతో పాటే భోజనం చేసేవారు. ఆయన స్టార్ అన్న భావన ఎక్కడా కనిపించేది కాదు” అని సత్య గుర్తు చేసుకున్నారు.
Also Read : అప్పుడు గుర్తు లేదా.. ఇప్పుడే యాదికి వచ్చిందాఅంబటి..?
చరణ్‌లో గర్వం అనే మాటకు చోటే లేదని, మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన వినయం, సంస్కారం ఆయనలో స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. కేవలం నటనతో కాదు, వ్యక్తిత్వంతో కూడా స్టార్‌డమ్ సంపాదించవచ్చని చరణ్ నిరూపించారని అభిప్రాయపడ్డారు. రంగస్థలం చిత్ర యూనిట్‌లో పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ సభ్యులు కూడా చరణ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడేవారని, కొందరైతే ఆయనపై ఉన్న అభిమానంతో “గుడి కట్టేస్తాం” అనే స్థాయిలో ప్రేమ చూపిస్తారని సత్య చెప్పారు.
సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ అనేక మందికి అండగా నిలుస్తూ, ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సేవ చేస్తున్న రామ్ చరణ్ నిజమైన హీరో అని సత్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా “ఇదే అసలైన స్టార్‌డమ్” అంటూ చరణ్‌ను ప్రశంసిస్తున్నారు.

