వై నాట్ 175 అన్నారు.. 30 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉంటామన్నారు.. కానీ చివరికి 11 స్థానాలకు పడిపోయారు. ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టు వరకు వెళ్లారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నేతలంతా సైలెంట్ అయ్యారు. దాదాపు ఏడాది పాటు వైసీపీలో చాలా మంది నేతలు బయటకు కూడా రాలేదు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే తన మకాం తాడేపల్లి నుంచి బెంగళూరు ఎలహంకకు మార్చేశారు. ఏడాది పాటు నెలకోసారి బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి.. ఓ నలుగురు నేతలతో మాట్లాడి.. మళ్లీ వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆయన వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లి ప్యాలస్‌కు వస్తున్నారు.
Also Read : జాన్వీ.. గ్లామర్ రోల్స్ కే పరిమితమా..?
అయితే తొలి నుంచి కొందరు నేతలు మాత్రం దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి పేర్ని నాని ముందు వరుసలో ఉన్నారు. కూటమి సర్కార్ పైన, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పైన పదే పదే విమర్శలు చేస్తున్నారు. నిజానికి పేర్ని నాని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తన భార్య పేరుతో ఉన్న గోడౌన్‌లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అది నిజమే అని.. అందుకు తాము పరిహారం చెల్లిస్తామని కూడా లిఖిత పూర్వకంగా పేర్ని నాని కుటుంబం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ కేసులో అరెస్టు భయంతో పేర్ని కుటుంబం కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలో కూడా ఉంది. బెయిల్ వచ్చిన తర్వాతే బయటకు వచ్చారు.
తాజాగా ప్రతి విషయంలో పేర్ని నాని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కూటమి సర్కార్ పైన, మంత్రులపైన పదే పదే విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీలో మంత్రులు, వారి శాఖలపై సెటైర్లు వేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాటోగ్రఫి చూస్తున్నారని.. హోమ్ మంత్రి అనిత విద్యా శాఖ గురించి మాట్లాడుతున్నారని.. విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పరిశ్రమల శాఖ చూస్తున్నారని.. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలులో లా అండ్ ఆర్డర్ చూస్తున్నారని.. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంధన పొదుపు గురించి చెబుతున్నారని.. చాలా గమ్మత్తుగా వ్యవహరిస్తున్నారని సెటైర్లు వేశారు.
Also Read : స్టీల్ ప్లాంట్.. నిర్లక్ష్యంతో బూడిదవుతున్న కార్మికులు..!
అయితే ప్రభుత్వంపై పేర్ని నాని ఈ తరహా వ్యాఖ్యలు చేసినా కూడా.. టీడీపీ నుంచి కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా కౌంటర్ ఇవ్వలేదు. ఈ ఏప్రిల్ నెలలోనే టీడీపీలో కొత్త కమిటీలు ఏర్పాటు చేశారు చంద్రబాబు. అందులో భాగంగా ఏకంగా 14 మందిని అధికార ప్రతినిధులుగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వారంతా ఏప్రిల్ నెలాఖరులో పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు కూడా చేపట్టారు. పార్టీ కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. నెల రోజులవుతున్నా కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్కరు కూడా బయటకు రాలేదు. పేర్ని నాని సహా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వటం లేదు. అసలు ఉన్నారో లేదో కూడా తెలియటం లేదు. అధికార ప్రతినిధుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నప్పటికీ.. పేర్ని నాని దూకుడుకు బ్రేకులు వేయటంలో పూర్తిగా విఫలమయ్యారనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

