ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐవీఆర్ఎస్ పోల్ సర్వే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాలుగు రోజులుగా ఓటర్లకు ఫోన్ కాల్స్ వెళ్లి, “ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీ ఓటు ఎవరికి వేస్తారు?” అనే ప్రశ్న అడుగుతున్నట్లు సమాచారం. కూటమికి అయితే 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే 2, నోటాకు అయితే 3 నొక్కాలని కోరుతున్న ఈ సర్వే రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సర్వేను ప్రభుత్వ వర్గాలే నిర్వహిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. అధికారంలో రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయం ఏమిటి, పాలనపై సంతృప్తి స్థాయి ఎంత మేరకు ఉంది. ఎన్నికలు జరిగితే రాజకీయ సమీకరణాలు ఎలా ఉండొచ్చనే అంశాలను అంచనా వేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : టీడీపీలో రాజ్యసభ రచ్చ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 164 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అంత భారీ మెజారిటీని కూటమి నాయకత్వం కూడా ఊహించలేదనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి కూడా. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ కూడా సైలెంట్‌గా బెంగళూరుకు మకాం మార్చారు. వై నాట్ 175 అని గొప్పగా ప్రకటించిన జగన్.. చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో.. నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. అయితే రెండేళ్ల వ్యవధిలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఏడాది పాటు సైలెంట్‌గా ఉన్న వైసీపీ.. ఇప్పుడు మళ్లీ చురుకుగా వ్యవహరిస్తుంది. ఇందుకు ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అమలు తీరుపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతుందని అధికార పక్షం చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఉన్న వాస్తవ అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఐవీఆర్ఎస్ సర్వే ఉపయోగపడుతుందా అనే ఆసక్తి నెలకొంది.
Also Read : సామాన్యుడి కోరిక తీర్చనున్న సీఎం..!
ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సర్వేకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ సర్వే ఫలితాలు అధికారికంగా బయటకు వస్తాయా? లేక అంతర్గత వ్యూహాలకే పరిమితం అవుతాయా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సర్వే ద్వారా లభించిన సమాచారాన్ని బట్టి ప్రభుత్వం తన రాజకీయ, పరిపాలనా వ్యూహాల్లో మార్పులు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా.. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ప్రజల స్పందనను అంచనా వేసే ప్రయత్నంగా ఈ ఐవీఆర్ఎస్ సర్వే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే ఈ సర్వే నిజంగా ఎవరు నిర్వహిస్తున్నారు.. దాని ఫలితాలు ఏమిటి.. అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. అందువల్ల దీనిపై వస్తున్న ప్రచారాన్ని నిర్ధారిత సమాచారంగా కాకుండా రాజకీయ చర్చలో భాగంగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది.

