ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ సర్కార్ అప్రమత్తమైంది. దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ కేంద్రలను కేంద్రం ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. డీఆర్ కాంగోలో ఎబోలా మహమ్మారి వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర స్థితి.. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఎబోలా వైరస్‌లు సాధారణంగా జంతువులకు సోకుతాయి. ముఖ్యంగా ఒక రకమైన గబ్బిలాలకు వస్తుంది. వైరస్ సోకిన వాటిని తిన్నా, లేదా వాటిని తాకిన మనుషుల్లో కూడా ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభం కావచ్చు. ఈ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే, ఇది అత్యంత అరుదైన వైరస్ రకానికి చెందింది. దీనికి ఎలాంటి టీకా లేదు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. ప్రారంభంలో దీని లక్షణాలు సాధారణ జ్వరంలా కనిపించడంతో చాలా మంది నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. అయితే సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే పరిస్థితి తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎబోలా వైరస్ లక్షణాలను ముందుగానే గుర్తించ డం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
Also Read : నాగేశ్వర్ వ్యాఖ్యల వెనుక ఉన్నదెవరు..?
దీని లక్షణాలు బయటపడేందుకు రెండు నుంచి 21 రోజుల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎబోలా వైరస్ ప్రారంభ లక్షణాలు సాధారణ వైరల్ ఫీవర్‌గా ఉంటాయని.. అయితే కొన్ని ముఖ్యమైన లక్షణాలను మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. అధిక జ్వరం (హై ఫీవర్), తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు, కండరాల నొప్పులు, తీవ్రమైన అలసట, నీరసం, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యక్తిగత వైద్యులని సంప్రదించడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
ఎబోలా వైరస్ నుంచి రక్షించుకునేందుకు కొన్ని సూచనలు చేశారు. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలని.. మాస్క్‌లు, గ్లవ్స్ వంటివి ఉపయోగించాలన్నారు. తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలని.. శానిటైజర్ ఉపయోగించే అలవాటు చేసుకోవాలన్నారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. వైరస్ సోకిన వ్యక్తిని ఇతరుల నుంచి వేరుగా ఉంచాలన్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎబోలా కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చిన వారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జ్వరం, అలసట లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అవగాహనతో ముందుజాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

