మీ పెట్టుబడులు సురక్షితం.. మీ పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుంది.. ఇవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ ఐ లైన్ స్టూడియోస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోర్త్ సిటీ నిర్మిస్తున్నామన్న రేవంత్.. నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మీ విస్తరణకు, పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు రేవంత్ రెడ్డి. అలాగే తెలంగాణలో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి కూడా సురక్షితమని.. ప్రభుత్వం తరఫున పూర్తి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ తెలుగు రాష్ట్రాల సీఎంల పనితీరుకు అద్దం పడుతోంది.
తెలంగాణలో పెట్టుబడులు సురక్షితం అని సీఎం రేవంత్ రెడ్డి బల్లగుద్ది మరీ చెబుతుంటే.. ఏపీ సీఎం మాత్రం అలాంటి హామీ ఎందుకు ఇవ్వటం లేదనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు.. ఏపీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తూ.. పెట్టుబడులను ఆకట్టుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014-19 మధ్య కాలంలో పెట్టుబడులు వచ్చాయి కూడా.
Also Read : ‘రాజనీతి సురేష్’ పై వంద కోట్ల దావా.. అంత భయం ఎందుకు?
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అంతే.. ఆంధ్రప్రదేశ్ ప్రగతి కుంటుపడింది. అమరావతి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్న సంస్థలను వైసీపీ నేతలు బెదిరించారు. దీంతో సగానికి పైగా సంస్థలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. విశాఖలో పెట్టుబడుల సదస్సు పేరుతో జగన్ సర్కార్ హంగామా చేసినప్పటికీ.. అప్పుడు ఎంఓయూ కుదుర్చుకున్న వాటిల్లో కనీసం ఒక్క సంస్థ కూడా పెట్టుబడులు పెట్టలేదు. మళ్లీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏపీకి పెట్టుబడి దారులు క్యూ కడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. పెట్టుబడి పెట్టాలని చంద్రబాబు, లోకేష్ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు కూడా.
తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెట్టుబడి దారుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో మీ పెట్టుబడులు సురక్షితం అని గొప్పగా, బహిరంగంగానే రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు. కానీ.. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభయం ఉన్న చంద్రబాబు… నాలుగోసారి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ.. ఇలాంటి హామీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. నిజానికి పెట్టుబడిదారుల్లో తొలి నుంచి ఉన్న అనుమానం ఒకటే.. మళ్లీ సైకో వస్తే.. 2029 ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే.. తమ భవిష్యత్తు ఏమిటీ..? మా పెట్టుబడులు సురక్షితమా.. కాదా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ జగన్ వస్తే.. అనే భయం ఇప్పటికీ పెట్టుబడిదారుల్లో ఉందనేది బహిరంగ రహస్యం.
Also Read : యుద్ధం ఆపేది లేదు.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
జగన్ మళ్లీ రాడు.. రానివ్వను అని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం 15 ఏళ్ల పాటు తమ పొత్తు కొనసాగుతుందని కూడా బహిరంగంగానే ప్రకటించారు. అలాగే పెట్టుబడులు సురక్షితం అని మాత్రం చెప్పలేకపోతున్నారు. వ్యాపారస్తునికి పార్టీలతో సంబంధం ఉండదు. అందుకే చాలా మంది అన్ని పార్టీల నేతలతో సఖ్యతగా ఉంటారు. విరాళాలు కూడా ఇస్తారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో అరాచకాలు సృష్టించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. అందుకే వ్యాపారస్తులు ఏపీ అంటే ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. అపారమైన అవకాశాలున్నప్పటికీ.. ప్రభుత్వం అండ ఉంటేనే ఏదైనా సాధ్యం. మరి రేవంత్ మాదిరిగా చంద్రబాబు కూడా ఏపీలో మీ పెట్టుబడులు సురక్షితమని హామీ ఇస్తారా లేదా.. వేచి చూడాలి.

