విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించేందుకు దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తిరుమల శ్రీవారి ఆలయ తరహాలో దుర్గ గుడిలో కూడా సేవకుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనే దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు ప్రకారం సేవకుల రిజిస్ట్రేషన్ జరుపుతుంది. ఇందులో భాగంగా సేవకుల రిజిస్ట్రేషన్, హాజరు పర్యవేక్షణ కోసం ‘అమ్మవారి సేవ’ మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ తెలిపారు.
Also Read : బిల్డప్ అదుర్స్.. బొమ్మ అట్టర్ ఫ్లాప్..!
రాష్ట్రంలోనే ఆదాయంలో తిరుమల తర్వాత స్థానంలో దుర్గ గుడి ఉంది. సాధారణ రోజుల్లో 30 నుండి 40 వేల మంది, వారాంతాల్లో 50 నుండి 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ భారీ రద్దీని క్రమబద్ధీకరించేందుకు సేవకుల తోడ్పాటు ఎంతో అవసరమని ప్రభుత్వం భావించింది. తిరుమల తరహాలో ఇక్కడ కూడా సేవకులను పారదర్శకంగా వినియోగించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్స్’ ఈ యాప్ రూపొందించింది.
అమ్మవారి ఆలయంలో సేవ చేయాలనుకునే భక్తులు ఈ యాప్ ద్వారా తమ వివరాలను డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానంలో నమోదు చేసుకోవచ్చు. అడ్మిన్లు క్యూఆర్ కోడ్ ద్వారా సేవకుల హాజరును డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తారు. దీనివల్ల సేవలో పారదర్శకత పెరుగుతుంది. ఈ యాప్‌లో చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 15 MB పరిమాణం ఉన్న ఈ యాప్‌లో సేవకులు తమ ప్రొఫైల్ మేనేజ్ చేసుకోవడం, సేవా చరిత్రను చూసుకోవడం, సేవా స్థితిని తనిఖీ చేయడం వంటి వసతులు ఉన్నాయి.
Also Read : దమ్ముంటే నిరూపించాలి.. వైసీపీ ఎమ్మెల్సీపై లోకేష్ ఫైర్..!
క్యూ లైన్ల నిర్వహణ, అన్న ప్రసాదం, ప్రసాదం కౌంటర్స్, భక్తుల ఫీడ్ బ్యాక్ సేకరణ, ఆన్ లైన్ సేవా కౌంటర్స్, భక్తులకు మంచి నీరు అందించడం, ఉపాలయాల్లో క్యూ లైన్ల నిర్వహణను సేవకులు చేయవలసి ఉంటుందని ఈవో పేర్కొన్నారు. సేవకుల వినియోగం వలన ఆలయ నిర్వహణలో భక్తులకు, అధికారులకు మధ్య సమన్వయం పెరుగుతుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. దేవస్థానంలో ఉచితంగా సేవ చేయాలనే ఆసక్తి ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ నుండి ‘అమ్మవారి సేవ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలని ఈవో ప్రకటించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సేవకుల కోసం తిరుమల తరహాలో ‘అమ్మవారి సేవ’ యాప్ ప్రారంభించనట్లు ఈవో తెలిపారు.

