మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను, ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడుగా వ్యవహరించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైన అవకాశంగా వినియోగించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య అన్నట్లుగా ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో వైసీపీ పార్లమెంటు సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. నిజానికి రాష్ట్రపతి పాలన అంటే ఏమిటో కూడా తెలియని వాళ్లు అలా డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా మారింది. ఇక కొందరు వైసీపీ నేతలు అంబటి, జోగి ఇళ్లకు చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. దాడులను ఖండిస్తున్నారు తప్ప.. అంబటి, జోగి చేసిన వ్యాఖ్యలపై మాత్రం మాట్లాడటం లేదు.
ఇక ఇదే గొప్ప అవకాశం అని భావిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. అరెస్టు అయిన అంబటి రాంబాబు, పరారీలో ఉన్న జోగి రమేశ్ ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించారు. మూక దాడులను రాజకీయ ప్రేరేపిత దాడులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడులకు కులం రంగు పులిమే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముందు గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. తాడేపల్లి నుంచి గుంటూరు వరకు భారీ ర్యాలీ ప్లాన్ చేశారు. నిజానికి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే అంబటిని అరెస్టు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో అంబటి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరి అంబటి ఇల్లు పరిశీలించిన తర్వాత రాంబాబు బూతు పురాణం గురించి జగన్ ప్రస్తావిస్తారా.. లేక మళ్లీ కులం కుంపట్లు రాజేసే ప్రయత్నం చేస్తారా చూడాల్సి ఉంది.
Also Read : భారత్ – పాక్ మ్యాచ్ విలువ ఇన్ని వేల కోట్లా..?
30 కిలోమీటర్ల దూరంలోని గుంటూరు పర్యటన తర్వాత ఒకరోజు పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత శుక్రవారం రోజున విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేశ్ నివాసానికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇస్తారు. అయితే అరెస్టులకు భయపడి అజ్ఞాతంలో ఉన్న జోగి రమేశ్ బయటకు రావాలని జగన్ చెప్తారా అనేది టీడీపీ నేతల ప్రశ్న. ఏ తప్పు చేయకపోతే.. జోగి రమేశ్ ఎందుకు దాక్కున్నారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. తన ఇంటికి కూడా జోగి రమేశ్ ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఇక ఇద్దరు నేతల ఇళ్లు పరిశీలించి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత.. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కేంద్రానికి జగన్ లేఖ రాసే అవకాశం ఉంది. దాడులకు సంబంధించిన ఆధారాలను జత చేసి.. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని అధికారికంగా ఫిర్యాదు చేస్తారనేది వైసీపీ నేతలు చెబుతున్న మాట. అలాగే పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదించిన తర్వాత విస్తృత రాజకీయ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించవచ్చని కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇక్కడే వైసీపీ నేతలకు ఒక విషయం మింగుడు పడటం లేదు. నిన్నటి వరకు తప్పంతా చంద్రబాబు, లోకేష్ మాత్రమే చేశారని.. టీడీపీ నేతలు దాడులు చేశారని చెప్తున్న వైసీపీ నేతలకు అంబటి రాంబాబు అల్లుడు చేసిన వ్యాఖ్యలు షాక్ ఇచ్చినట్లు అయ్యింది.
Also Read : బ్రేకింగ్: చంద్రబాబు – పవన్ అర్జెంట్ మీట్..!
ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు తీవ్రంగా బాధపడుతున్నట్లు ఆయన అల్లుడు ఉపేష్ జైలులో ములాఖత్ తర్వాత బయటకు వచ్చి వెల్లడించారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబునే రాంబాబు బూతులు తిట్టినట్లు ఒప్పుకున్నారని ఆయన అల్లుడే పరోక్షంగా చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు అంబటి రాంబాబు మంచోడు.. ఆయన చంద్రబాబును ఏమీ అనలేదు అని చెప్పిన వైసీపీ నేతలంతా.. ఇప్పుడు ఒక్కసారిగా మాయమైపోయారు. టీడీపీ కార్యకర్తలే మొదట పరిస్థితిని రెచ్చగొట్టారని, అందుకే రాంబాబు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాంబాబుకు “పాఠం నేర్పుతామని” కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన ప్రకటనపై కూడా ఇప్పుడు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పాఠం అంటే ఏమిటని నిలదీస్తున్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత “గుడ్డలూడదీస్తాం” అని జగన్ చెప్పిన మాటను ఎలా అర్థం చేసుకోవాలని నిలదీస్తున్నారు.

