టీడీపీ నాయకుడు, నటసింహం.. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజక వర్గంలో వైసీపీ రాజకీయాలు ఎటూ పాలు పోవడం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ ఇంచార్జ్ బాధ్యతలను పిల్లి దీపిక కు ఇచ్చారు. కానీ, ఆమె కన్నా.. ఆమె భర్త వేణు చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. గత నెలలో బాలయ్యపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ కార్యాలయంపైనా దాడి జరిగింది.
Also Read : లక్ష్యం దిశగా పోలవరం పరుగులు..!
అయినా.. వేణు తన నోరును అదుపులో పెట్టుకోవడం లేదు. పైగా.. ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే బాలయ్య సహా.. ఆయన అనుచరులపై అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేశారు. చెరువులు తవ్వేస్తున్నారని.. అవినీతి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. దీనికి టీడీపీ నుంచి కూడా భారీ కౌంటర్లు వచ్చాయి. అయితే.. వాస్తవం ఏంటంటే.. ఇక్కడ వైసీపీని ఏదో ఒక రకంగా.. పైకి లేపాలన్నది వీరి ప్రయత్నం.
కానీ, గత మూడు ఎన్నికల్లోనూ వైసీపీకి అది సాధ్యం కాలేదు. అంతేకాదు.. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా కనిపించినా.. హిందూపురంలో మాత్రం బాలయ్య విజయాన్ని ఎవరూ ఆపలేక పోయారు. మైనారిటీ వర్గానికి చెందిన బీసీనేతకు అవకాశం ఇచ్చినా.. ఆయన కూడా.. విజయం సాధించలేదు. పైగా ఇప్పుడు పార్టీ మారిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అయినా.. పార్టీని బలోపేతం చేయాలన్నది ఇక్కడి దీపిక, ఆమె భర్త లక్ష్యం.
Also Read : విజయసాయి రెడ్డి తర్వాత అన్నకే ఈడీ ఆహ్వానం..?
కానీ, దీనికి అనుసరించాల్సిన వ్యూహాలను మాత్రం వదిలేశారు. బాలయ్యను టార్గెట్ చేస్తే.. పోయేదే తప్ప.. వచ్చేది ఏమీ ఉండదని నాయకులు తెలుసుకోలేక పోతున్నారు. అంతేకాదు.. ప్రజలకు చేరువ అయితేనే అంతో ఇంతో తమకు ప్రభావం పెరుగుతుందన్న లక్ష్యాన్ని కూడా మరిచిపోతున్నారు. దీనిని వదిలేసి.. అనవసర వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రతి విషయాన్ని లేనిపోని వివాదాల చుట్టూ తీసుకువెళ్తున్నారు. దీనికితోడు అంతర్గత కుమ్ములాటలను సరిచేసుకోవడం లేదు. దీంతో ఎంత జాకీలువేసినా.. హిందూపురంలో వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు పరిశీలకులు.

