పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర అధికార మార్పిడికి పరిమితం కాలేదు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌లతో సరిహద్దులు పంచుకుంటూ, 2,217 కిలోమీటర్ల సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ విజయం.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు, ఇస్లామాబాద్ నుంచి డాకా వరకు ఈ గెలుపు ప్రకంపనలు సృష్టిస్తోంది.
2009 నాటికే పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష పాలనకు చరమగీతం పాడాలని అమెరికా వ్యూహరచన చేసినట్లు వికిలీక్స్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అప్పట్లో కోల్‌కతాలోని అమెరికా కాన్సులేట్, మమతా బెనర్జీని తమకు అనుకూలమైన ‘ప్రోత్సాహకర నేత’గా గుర్తించింది. అక్టోబర్ 20, 2009న పంపిన కేబుల్ ప్రకారం, సీపీఐ (ఎం) కంటే మమతా ప్రభుత్వం అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని వారు భావించారు. ఉక్రెయిన్‌లో విక్టర్ యనుకోవిచ్‌ను గద్దె దించి జెలెన్‌స్కీని తెచ్చినట్లుగా లేదా లిబియాలో గడ్డాఫీ పతనం తర్వాత తలెత్తిన పరిస్థితుల మాదిరిగానే, బెంగాల్‌లో కూడా తమకు అనుకూలమైన గొంతుక ఉండాలని వాషింగ్టన్ ఆశించింది.
Also Read : దస్తగిరి హ*త్య కేసులో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేత
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించేందుకు నిరాకరించడం అక్కడ పెను మార్పులకు దారితీసింది. ఆగస్టు 2024లో జరిగిన విద్యార్థి నిరసనలు, ఆమె భారత్‌కు పారిపోవాల్సి రావడం వెనుక ‘ఉక్రెయిన్ తరహా వ్యూహం’ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, అమెరికా మద్దతు ఉన్న ముహమ్మద్ యూనస్ పట్టు సడలి, 2026 తర్వాత తారిక్ రెహమాన్ హయాంలో భారత్ – బంగ్లాదేశ్ సంబంధాలు మళ్లీ మెరుగుపడటం వాషింగ్టన్‌కు మింగుడుపడని అంశం. ఇప్పుడు బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం వల్ల చొరబాటు అరికట్టడంతో పాటు, తీస్తా నదీ జలాల పంపిణీ వంటి పెండింగ్ అంశాలు వేగవంతం కానున్నాయి.
బీజింగ్ దృష్టిలో మమతా బెనర్జీ ఒక ‘రక్షణ కవచం’. ప్రధాని మోదీ ‘ఈస్ట్ పాలసీ’ మరింత బలోపేతం కాకుండా ఆమె అడ్డుకోగలరని చైనా భావించేది. ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయింది. సరిహద్దు రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు తమకు అనుకూలమని ఇస్లామాబాద్ ఎప్పుడూ ఆశించేది. ఇద్దరు పాకిస్తాన్ హైకమిషనర్లు ఆమెను ఆహ్వానించడం దీనికి సంకేతం. ఇప్పుడు బీజేపీ రాకతో ఆ వ్యూహాలకు గండి పడింది.
Also Read : ఎన్టీఆర్ పేరుతో వసూళ్ల దందా.. తారక్ ఆఫీస్ సంచలన లేఖ..!
గత 49 ఏళ్లలో వామపక్ష, తృణమూల్ పాలనలో బెంగాల్ ఆర్థికంగా వెనుకబడింది. భారత సగటు జీడీపీ వృద్ధి 6.98% ఉంటే, బెంగాల్ వృద్ధి కేవలం 4.59% వద్దే ఆగిపోయింది. ఒకప్పుడు పారిశ్రామిక హబ్‌గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారికి పరిపాలనను గాడిలో పెట్టడం కత్తి మీద సాము వంటిదే. రాష్ట్ర పోలీసు వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేయడం, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ – పట్టణ వ్యత్యాసాలను తగ్గించడం కొత్త ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతలు కావాలి. బెంగాలీ ‘భద్రలోక’.. మధ్యతరగతి విద్యావంతులు మార్ను కోరుకున్నారు. ఈ తీర్పు కేవలం కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్‌కే పరిమితం కాకుండా, మొత్తం దక్షిణాసియాలో భారత పట్టును పెంచే వ్యూహాత్మక విజయంగా నిలుస్తుంది.

