వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై ఇప్పుడు సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. ఎవరినైనా సరే.. తన అవసరానికి వాడేస్తారని.. అవసరం తీరిన తర్వాత కూరలో కరివేపాకు మాదిరిగా తీసి పారేస్తారని.. ఇదే జగన్ నైజం అంటున్నారు. ఇందుకు తాజాగా బొత్స సత్యనారాయణ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆయన పట్ల జగన్ వైఖరిని వైసీపీ నేతలే తప్పుబడుతున్నారు. ఇలా చేస్తే.. ఎవరు పార్టీలో ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. కారణం ఏంటీ..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు మంత్రిగా వ్యవహరించారు బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న బొత్స.. విజయనగరం జిల్లాను శాసించే స్థాయికి ఎదిగారు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. అందుకే రెండోసారి వైఎస్ఆర్ సీఎం అయిన వెంటనే.. బొత్సను పీసీసీ అధ్యక్షుడిని చేశారు. ఫోక్స్‌వ్యాగన్ కేసులో భారీ కుంభకోణం జరిగినా సరే.. బొత్స మీద వైఎస్ఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అటు జగన్ కూడా బొత్సకు చాలా గౌరవం ఇచ్చారు. ఇందుకు ప్రధాన కారణం.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు గర్జన పేరుతో ముద్రగడ పద్మనాభ రెడ్డి తునిలో నిర్వహించిన బహిరంగ సభకు బొత్స తనవంతు సాయం అందించారు. ప్రజలను రెచ్చగొట్టడంలో బొత్స ధిట్ట అనేది అందరికీ తెలిసిన విషయమే.
తుని కాపు గర్జన కూడా వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఓ కారణమనేది జగన్ భావన. అందుకే బొత్సను తండ్రి సమానులు అంటూ పొగిడారు. బొత్స కూడా కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఇదంతా ఎన్నికలకు ముందు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పార్టీలకు అతీతంగా అంతా వెళ్లి పరామర్శిస్తున్నారు.. కానీ జగన్ మాత్రం కనీసం బొత్స ఊసు ఎత్తడం లేదు. బెంగళూరు – తాడేపల్లి మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్న జగన్.. పెళ్లిళ్లకు, వేడుకలకు హాజరవుతున్నారు తప్ప.. హైదరాబాద్ వెళ్లి బొత్సను మాత్రం ఎలా ఉన్నారు అని పరామర్శించటం లేదు. దీనిపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు.
Also Read : నాడు వద్దన్న అదానీ సోలార్.. నేడు ముద్దయింది
మండలి సమావేశాల్లో బొత్స తీరుపై జగన్ ఆగ్రహంతో ఉన్నారనేది వైసీపీ నేతల మాట. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బొత్స వ్యవహరించటం లేదని.. అదే సమయంలో సభ బయట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రి నారా లోకేష్‌తో కూడా బొత్స నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇదే జగన్ ఆగ్రహానికి కారణం అంటున్నారు. అందుకే అనారోగ్య కారణల సాకుతో మండలిలో ప్రతిపక్ష నేత హోదా నుంచి బొత్సను తప్పించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బొత్సను జగన్ పూర్తిగా పక్కన పెట్టేసినట్లే.. అనే చర్చ జోరుగా జరుగుతోంది.

