తెలుగు సినీ చరిత్రలో వాణిజ్య విజయాల కంటే కళాత్మక విలువలతో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాలు కొన్నే ఉంటాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో ఒకటి దర్శకుడు కె.విశ్వనాధ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’. 1986 జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నేటితో నలభై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.
‘సిరివెన్నెల’ పేరు వినగానే ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గుర్తుకు రావడం సహజం. ఈ చిత్రంలోని పాటల ద్వారా ఆయనకు అపారమైన గుర్తింపు లభించగా, అనంతరం ‘సిరివెన్నెల’ అనే పదమే ఆయన పేరులో అంతర్భాగమైంది. మరోవైపు ‘శంకరాభరణం’ విజయానంతరం దర్శకుడు కె. విశ్వనాథ్‌కు ‘కళాతపస్వి’ అనే బిరుదు స్థిరపడింది. ఆయన రూపొందించే ప్రతి చిత్రంపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొనే రోజుల్లోనే ‘సిరివెన్నెల’ విడుదలైంది.
Also Read : మద్యం కుంభకోణం.. వైఎస్ జగన్‌కు ఈడీ నోటీసులా..?
విశ్వనాథ్ చిత్రాలను అభిమానించే ప్రేక్షకులను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకున్నప్పటికీ, సాధారణ వాణిజ్య ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయి ఆదరణను అందుకోలేకపోయింది. అయితే కాలక్రమేణా చిత్రంలోని పాటలు, వాటి సాహిత్య గాఢత, భావవ్యక్తీకరణ సాహిత్యాభిమానులను విపరీతంగా ఆకర్షించాయి. ఫలితంగా ‘సిరివెన్నెల’ ఒక కళాత్మక చిత్రంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
ఈ చిత్ర కథాంశంలోనూ విశేషమైన వైవిధ్యం కనిపిస్తుంది. కథానాయకుడు దృష్టి లోపం కలిగిన వ్యక్తి కాగా, కథానాయిక మూగ యువతి. వీరిద్దరి జీవితాల్లోకి ప్రవేశించిన మరో మహిళ పాత్రతో కథ భావోద్వేగభరితంగా సాగుతుంది. ఈ సున్నితమైన కథను హృదయాలను తాకే విధంగా కె. విశ్వనాథ్ ఆవిష్కరించారు.
అయితే ‘సిరివెన్నెల’ విడుదలైన రోజునే ప్రముఖ నటులు నటించిన రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. శోభన్ బాబు, జయసుధ జంటగా నటించిన ‘జీవనరాగం’, అలాగే కృష్ణ, శ్రీదేవి జోడీగా రూపొందిన ‘ఖైదీ రుద్రయ్య’ చిత్రాలు పోటీగా నిలవడంతో ‘సిరివెన్నెల’కు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల రాక దక్కలేదు. అయినప్పటికీ సంగీత దర్శకుడు కే.వీ మహదేవన్ స్వరపరిచిన పాటలు సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.
Also Read : రష్యా హై అలర్ట్ లోనూ.. ఆగని లోకేష్ మిషన్
చిత్రంలో కథానాయకుడిగా బెంగాలీ నటుడు సర్వధమన్ బెనర్జీ నటించగా, ఆయనను ఆరాధించే అభిమానిగా సుహాసిని కనిపించారు. హీరో జీవితంలో ప్రేమానుభూతిని నింపే పాత్రలో బెంగాలీ నటి మూన్ మూన్ సేన్ నటించారు. వీరితో పాటు శుభలేఖ సుధాకర్, సాక్షి రంగారావు, సంయుక్త, శుభ, వరలక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనంతరం కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించిన మీనా ఈ చిత్రంలో బాలనటిగా కనిపించడం విశేషం.
విడుదల సమయంలో పెద్దగా వాణిజ్య విజయాన్ని అందుకోలేకపోయిన ‘సిరివెన్నెల’, అనంతర కాలంలో టెలివిజన్ ప్రసారాల ద్వారా మరింత విస్తృత ప్రేక్షకాదరణను పొందింది. నేటికీ ఈ చిత్రం తన సంగీతం, సాహిత్యం, భావోద్వేగ గాఢతతో తెలుగు సినీ అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.

