ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్నేషనల్ కంపెనీ. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ మాతృసంస్థ అయిన ఐషర్ మోటార్స్, ఏపీలో సరికొత్త గ్రీన్ ఫీల్డ్ ఉత్పాదక ప్లాంట్ ఏర్పాటుకు అధికారికంగా నిధుల ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లాలోని తడ వద్ద ప్రతిపాదించిన ఈ మెగా ప్రాజెక్ట్ తొలి దశ నిర్మాణ పనుల కోసం రూ. 1,225 కోట్ల పెట్టుబడికి ఐషర్ మోటార్స్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ విదేశాల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిళ్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఈ భారీ విస్తరణ ప్లాన్ ను చేపట్టింది.
Also Read : భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ తమదే అని వైసీపీ నేతల మాటల్లో నిజమెంత..?
తడ పారిశ్రామిక ప్రాంతంలో దశలవారీగా మొత్తం రూ. 2,500 కోట్ల పెట్టుబడి పెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు మొదటి దశకు సంబంధించిన రూ. 1,225 కోట్ల నిధులకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఈ సరికొత్త ప్లాంట్ నిర్మాణం పూర్తి స్థాయికి చేరుకోవడానికి కాలపరిమితిని కూడా సంస్థ ప్రకటించింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి కానుందని ఐషర్ మోటార్స్ వెల్లడించింది. మొదటి దశ పూర్తయ్యే సరికి ఈ ప్లాంట్ ద్వారా ఏటా అదనంగా 4.5 లక్షల మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం చేకూరుతుందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
Also Read : డీఎస్సీ పరీక్ష.. రాజకీయాల కోసమా? లేక ఉద్యోగార్థుల కోసమా?
రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థకు తమిళనాడు వెలుపల ఏర్పాటు కాబోతున్న మొదటి అతిపెద్ద తయారీ ప్లాంట్ ఇదే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తడ వద్ద కేటాయించిన సుమారు 215 ఎకరాల స్థలంలో ఈ ప్లాంట్ రూపుదిద్దుకోనుంది. ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి చెందిన అనుబంధ పరిశ్రమలు కూడా ఏపీకి తరలివచ్చే అవకాశం ఉంది.

