తమిళనాడు అధికార పార్టీ తమిళగ వెట్రి కళగం ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్ వ్యవహారం ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. కళ్లకురిచ్చి జిల్లా మహిళా కలెక్టర్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడమే కాకుండా, బహిరంగ కార్యక్రమంలో ఆమె వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించారనే ఆరోపణలపై ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇటీవల మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించి ప్రభుత్వాన్ని మందలించడంతో, కలెక్టర్ అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read : ఫేస్బుక్ నుంచి పబ్జీ వరకు.. ఆర్మీలో కఠిన ఆంక్షలు
దీంతో కళ్లకురిచ్చి మహిళా పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 75 (లైంగిక వేధింపులు), సెక్షన్ 132 (ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడం) సహా మొత్తం 5 కీలక సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పరారీలో ఉన్న ఎమ్మెల్యే అరెస్ట్ కోసం గాలిస్తున్నారు. ఈ కేసును ఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు జరిపించాలని, ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఒక్క ఘటనే కాకుండా అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే టీవీకే ఎమ్మెల్యేలు, పార్టీ నేతల వరుస వివాదాలు ముఖ్యమంత్రి విజయ్‌కు తీవ్ర తలనొప్పిగా మారాయి.
ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ వంటి నేతలు ప్రభుత్వ అధికారుల రోజువారీ పాలనలో అనవసరంగా జోక్యం చేసుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వల్ల వారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ప్రతిపక్షాలు ఇప్పటికే గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. మరోవైపు, పార్టీ ఎమ్మెల్యే ముస్తఫాకు రూ. 30 కోట్ల ఆఫర్ వ్యవహారం, పలువురు ఎమ్మెల్యేలు బహిరంగ వేదికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, స్థానిక స్థాయిలో క్యాడర్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో ప్రతిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలకు అస్త్రాలను అందించినట్లవుతోంది.
Also Read: యలహంక ఆస్తులు.. వివేకా హత్య.. రెండింటికీ లింక్ ఉందా?
వరుసగా వెలుగుచూస్తున్న ఈ వివాదాలతో అప్రమత్తమైన సీఎం విజయ్, ఇటీవల టీవీకే ఎమ్మెల్యేలందరితో ప్రత్యేకంగా సమావేశమై ప్రవర్తన మార్చుకోవాలని, అధికారుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని హెచ్చరించారు. అయినప్పటికీ, తాజాగా ఒక ఐఏఎస్ అధికారిణి, జిల్లా కలెక్టర్ స్థాయి వ్యక్తిపైనే టీవీకే ఎమ్మెల్యే లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం విజయ్ ప్రభుత్వానికి, పార్టీ ప్రతిష్టకు సమస్యగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


