ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కాక్రోచ్ జనతా పార్టీ గురించే ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేవలం వారం రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 18 మిలియన్ల అంటే కోటి 80 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే వేగంగా ఈ పేజీ ఫాలోయింగ్ పెరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టింది..? దీని వెనుక ఉన్నది ఎవరు..? అనే వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Also Read : చిదంబరం వర్సెస్ లోకేష్.. అదిరిపోయే కౌంటర్..!
ఈ పార్టీ పుట్టుకకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్యే కారణం. గత శుక్రవారం ఒక కేసు విచారణలో ఆయన నకిలీ డిగ్రీలు ఉన్నవారిని ఉద్దేశించి కాక్రోచ్ అనే పదాన్ని వాడారు. అయితే, ఆయన నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన వివరణ ఇస్తూ తాను యువతను అలా అనలేదని, నకిలీ పట్టాలు ఉన్నవారి గురించి మాత్రమే మాట్లాడానని స్పష్టం చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
బోస్టన్ యూనివర్శిటీలో చదువుకుంటున్న మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దిప్కే అనే యువకుడు, ఈ వ్యాఖ్యలకు నిరసనగా మే 16న ఒక గూగుల్ ఫామ్ షేర్ చేసి కాక్రోచ్ జనతా పార్టీని ప్రకటించాడు. “బొద్దింకలని పిలవబడే వారందరూ ఇందులో చేరండి” అంటూ ఆయన చేసిన పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయింది. కేవలం సరదాగా, ఒక సెటైర్ లాగా మొదలైన ఈ ప్రచారం ఇప్పుడు ఒక పెద్ద డిజిటల్ ఉద్యమంలా మారింది. ఇప్పటికే లక్షకు పైగా మంది ఇందులో సభ్యులుగా నమోదు చేసుకున్నట్లు అభిజీత్ వెల్లడించారు.
Also Read : ఏపీలో రాజ్యసభ సందడి.. మళ్ళీ వీళ్ళేనా..?
ఈ సోషల్ మీడియా ట్రెండ్ కేవలం యువతకే పరిమితం కాలేదు. రాజకీయ నేతలు కూడా ఇందులో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా బిజెపి వర్సెస్ సీజేపి అని పోస్ట్ చేయగా, కొందరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తమను తాము ఈ పార్టీ సభ్యులుగా ప్రకటించుకున్నారు. అయితే, ఇంత తక్కువ సమయంలో ఇన్ని మిలియన్ల ఫాలోయర్లు రావడం వెనుక నకిలీ ఖాతాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇది కేవలం ఒక వారం రోజుల క్రేజ్ మాత్రమేనా లేక యువత అసంతృప్తికి ఒక డిజిటల్ రూపమా అనేది వేచి చూడాలి. మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మా లక్ష్య” అని వ్యవస్థాపకుడు అభిజీత్ చెబుతున్నారు. ఏది ఏమైనా, ఒక చిన్న వ్యాఖ్య నుంచి పుట్టిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తోందనడంలో సందేహం లేదు.

