పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇప్పుడు వైసీపీ, BRS మధ్య చిచ్చు పెట్టింది. కృష్ణా జలాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్‌ను ఇరుకున పెట్టబోయి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఓ కామెంట్, ఇప్పుడు వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి హరీష్ రావు వాడిన భాషపై వైసీపీ సోషల్ మీడియా భగ్గుమంటోంది. అసలు జగన్‌పై హరీష్ రావుకు ఎందుకంత కోపం..? గతంలో కూడా ఆయన జగన్‌ను ఎందుకు టార్గెట్ చేశారు.? అనే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : విజయ్ కు చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యేలు..!
అసలేం జరిగిందంటే… పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతుంటే రేవంత్ సర్కార్ చంద్రబాబుకు సహకరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇస్తూ..అసలు నీళ్ల దోపిడీకి పునాది వేసిందే BRS అని, నాడు జగన్‌ను ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరీ నీళ్లు తరలించుకుపోయేందుకు సహకరించారని విమర్శించారు. రేవంత్ ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో హరీష్ రావు స్పందిస్తూ..జగన్‌ను కేసీఆర్ గల్లా పట్టి వార్నింగ్ ఇచ్చారు, నీటి తరలింపు ఆపకపోతే అలంపూర్ వద్ద బ్యారేజీ కడతామని అల్టిమేటం జారీ చేశారని వ్యాఖ్యానించారు.
హరీష్ రావు అన్న గల్లా పట్టి వార్నింగ్ అనే పదమే ఇప్పుడు అసలు వివాదానికి దారితీసింది. తమ అధినేతను హరీష్ రావు అగౌరవపరిచేలా మాట్లాడారంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. నిజానికి, హరీష్ రావు ఇలా జగన్‌ను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో హరీష్ రావు ఏపీ పాలనను ఉద్దేశించి పదునైన విమర్శలు చేశారు. ఏపీలో కరెంటు కోతలు ఉన్నాయని, రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, జగన్ పాలన బాగోలేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
Also Read : సెంచరీ కొట్టిన జగన్.. ఏపీకి గెస్ట్‌గా వందోసారి..!
KCR, జగన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, హరీష్ రావు మాత్రం తెలంగాణ ప్రయోజనాలు, తమ పార్టీ పనితీరును హైలైట్ చేసుకునే క్రమంలో ఏపీలోని జగన్ పాలనను ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే వచ్చారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ విమర్శల నుంచి తమ పార్టీని రక్షించుకునే ప్రయత్నంలో ఆయన జగన్‌ను లాగడం, పైగా గల్లా పట్టి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. రాజకీయ అవసరాల కోసమే హరీష్ రావు పదేపదే జగన్‌పై ఇలా విరుచుకుపడుతున్నారా? లేక మొదటి నుంచీ జగన్ వ్యవహారశైలిపై ఆయనకు అంతే కోపం ఉందా..అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.


