బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి మరియు ఆ రుణాలు అందించే సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ మరియు దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పతనమవుతున్న నేపథ్యంలో, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలను ఆర్బీఐ అప్రమత్తం చేసింది. బంగారం విలువ అకస్మాత్తుగా తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థలో తలెత్తే రిస్క్‌లను నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆర్థిక సంస్థలు బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం వరకు రుణంగా ఇస్తుంటాయి.
Also Read : యలహంక ఆస్తులు.. వివేకా హత్య.. రెండింటికీ లింక్ ఉందా?
అయితే, ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గడంతో, గతంలో ఎక్కువ ధర ఉన్నప్పుడు ఇచ్చిన రుణాల విలువకు, ఇప్పుడున్న బంగారం మార్కెట్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడుతోంది. ఒకవేళ రుణగ్రహీతలు సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే, ఆ బంగారాన్ని వేలం వేసినా ఆర్థిక సంస్థలకు అసలు మొత్తం తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆర్బీఐ, రుణ సంస్థలను వెంటనే అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో గోల్డ్ లోన్ల జారీ ప్రక్రియలో తనిఖీలు, పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలనన ఎన్ బీ ఎఫ్ సీలను ఆర్బీఐ స్పష్టంగా ఆదేశించింది.
Also Read : ఫేస్బుక్ నుంచి పబ్జీ వరకు.. ఆర్మీలో కఠిన ఆంక్షలు
బంగారం స్వచ్ఛతను, ప్రస్తుత మార్కెట్ విలువను కచ్చితంగా అంచనా వేయాలని, నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో రుణాలు ఇవ్వకూడదని సూచించింది. అంతేకాకుండా, నగదు రూపంలో ఇచ్చే రుణాల పరిమితిని ఖచ్చితంగా పాటించాలని, రుణాల మంజూరు మరియు వేలం ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని ఆర్థిక సంస్థలకు గట్టిగా తెలిపింది. ఆర్బీఐ తాజా ఆదేశాలతో సామాన్యులు, చిన్న వ్యాపారులపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కొత్తగా బంగారం రుణాలు తీసుకోవాలనుకునే వారికి, అలాగే గడువు ముగిసిన పాత లోన్లను రెన్యువల్ చేసుకోవాలనుకునే వారికి కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే తక్కువ మొత్తం లోన్ రావడం, పాత లోన్ రెన్యువల్ సమయంలో కొంత అదనపు నగదు చెల్లించాల్సి రావడం వంటి మార్పులు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.


