ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు అటవీ ప్రాంతంలో ‘ఎక్స్‌ప్లోరర్’ అనే పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను, రైతులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి పాపికొండల మీదుగా వందల కిలోమీటర్లు ప్రయాణించి, ఏలూరు జిల్లా దాటి ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించిన ఈ పెద్దపులి గత ఐదు రోజులుగా ఇక్కడి అటవీ ప్రాంతాల్లోనే సంచరిస్తోంది. విస్సన్నపేట, రెడ్డిగూడెం, తిరువూరు మండలాల మీదుగా కనుమూరు అడవికి చేరుకున్న ఈ పులి, వరుసగా మూడో రోజు కూడా అక్కడి కొండ ప్రాంతాన్ని విడిచి కదలలేదు. తాను ఉన్న చోటు నుంచి కేవలం 50 మీటర్ల పరిధిలోనే తిరుగుతున్నట్లు దాని మెడకు అమర్చిన రేడియో కాలర్ ట్రాకర్ సిగ్నల్స్ ద్వారా స్పష్టమవుతోంది.
Also Read : అంతర్గత ప్రజాస్వామ్యం.. బాగా ముదిరినట్లుంది..!
అత్యాధునిక జియో ట్యాగ్ పరికరాలు, డ్రోన్ కెమెరాల సాయంతో అటవీశాఖ అధికారులు పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పగటిపూట దట్టమైన పొదల్లో విశ్రాంతి తీసుకుంటూ, రాత్రి వేళల్లో మాత్రమే పులి కదులుతుండటంతో దాన్ని బంధించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు పుణె నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని, మత్తుమందు నిపుణులను రంగంలోకి దించారు. మైలవరం అటవీ రేంజ్ అధికారులతో కలిసి ప్రత్యేక రెస్క్యూ బృందాలు కనుమూరు అడవిని జల్లెడ పడుతున్నాయి.
Also Read : ఏపీకి మరో రెండు, మూడు తుపానుల ముప్పు..?
అయితే, ఇంత చిన్న పరిధిలోనే పులి ఉనికి ఖచ్చితంగా తెలుస్తున్నప్పటికీ, దట్టమైన అడవి, కొండ ప్రాంతం కావడంతో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం గాని, బోనులో బంధించడం గాని సాధ్యం కావడం లేదు. దీంతో అసలు ఈ ‘ఆపరేషన్ టైగర్’ ఎప్పటికి ముగుస్తుంది, పులి ఎట్టకేలకు దొరుకుతుందా లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోవైపు, సోషల్ మీడియాలో పులి దొరికిందంటూ వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని తిరువూరు ఆర్డీవో, అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. కనుమూరు, చిక్కుళ్లగూడెం, నరికింపాడు సహా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు, రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, రాత్రి సమయాల్లో గుంపులుగా లైట్లు పట్టుకుని తిరగాలని, పశువులను అడవిలోకి మేతకు పంపవద్దని అధికారులు కీలక సూచనలు జారీ చేశారు.


