1978 డిసెంబర్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తీహార్ జైలులో ఉన్న రోజుల నాటి ఆసక్తికర విషయాలను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన తాజా ఆత్మకథ.. బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ లో వెల్లడించారు. ఆ ఏడాది క్రిస్మస్ రోజున జైలులో ఉన్న తన అత్తగారు ఇందిరా గాంధీ కోసం సోనియా ప్రత్యేకంగా భోజనం తీసుకెళ్లారట. అయితే, ఇందిరా గాంధీ కోరిక మేరకు తనతో పాటు కాపలాగా ఉన్న ముగ్గురు మహిళా సిబ్బందికి, అదే కాంపౌండ్‌లో ఖైదీగా ఉన్న బికీనీ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ సహచరురాలికి కూడా సరిపడా ఆహారాన్ని తీసుకెళ్లినట్లు సోనియా గుర్తుచేసుకున్నారు.
Also Read : జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ స్పీడ్..!
ఆ విదేశీ యువతి పట్ల ఇందిరా గాంధీ ఎంతో జాలి చూపించారని, ఆమె పోర్క్ తినదని తెలిసి మెనూను మార్చి ప్రత్యేకంగా రోస్ట్ చికెన్ తయారు చేయించి తీసుకెళ్లినట్లు సోనియా తన పుస్తకంలో వివరించారు. 1976లో చార్లెస్ శోభరాజ్‌తో పాటు అరెస్టయిన ముగ్గురు మహిళల్లో ఆయన ప్రియురాలు మేరీ-ఆండ్రీ లెక్లెర్క్ అప్పట్లో తీహార్ జైలులో ఉండేవారు. ఆమె తరచూ ఆస్ట్రేలియా పౌరుల నకిలీ పాస్‌పోర్టులపై ప్రయాణించడం వల్ల సోనియా గాంధీ ఆమెను ఆస్ట్రేలియా యువతిగా గుర్తుపెట్టుకుని ఉండవచ్చని జాతీయ మీడియా తెలిపింది.
Also Read : జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్లే హీరోలు..!
జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో సభా హక్కుల ఉల్లంఘన కింద 1978 డిసెంబర్ 19న ఇందిరా గాంధీని అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపగా, డిసెంబర్ 26న ఆమె విడుదలయ్యారు. డిసెంబర్ చలిలో కనీసం తలుపులు, కిటికీలు లేకుండా కేవలం ఇనుప కడ్డీలు, సిమెంట్ దిమ్మె మాత్రమే ఉన్న గదిలో ఇందిరా గాంధీని ఉంచడం చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. జైలు గదిలో మొత్తం 193 ఇనుప కడ్డీలు, 11 తాళాలు ఉన్నాయని లెక్కపెట్టి మరీ ఇందిర తనకు ఒక చిన్న చీటీ ద్వారా సరదాగా తెలియజేశారని సోనియా ఆ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.


