తీర ప్రాంత ప్రజలు తీవ్ర తుఫాన్ అర్నబ్ సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోకముందే, ఆంధ్రప్రదేశ్‌కు మరో కొత్త తుఫాన్ ముప్పు పొంచి ఉందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. బంగాళాఖాతంలో అక్టోబర్ 28న తీవ్ర తుఫాన్‌గా అర్నబ్ తీరాన్ని దాటిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి. అయితే, ఈ గండం గడిచి 24 గంటలు కూడా కాకముందే సముద్రంలో మరో అలజడి మొదలైందని అంతర్జాతీయ వాతావరణ నమూనాలు హెచ్చరిస్తున్నాయి.
Also Read : బాబోయ్.. అక్టోబర్ నెల అంటేనే భయం..!
అమెరికా, యూరప్‌కు చెందిన మేజర్ వెదర్ మోడల్స్ అంచనాల ప్రకారం.. నవంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో మరో కొత్త వాతావరణ వ్యవస్థ రూపుదిద్దుకోనుంది. నవంబర్ 1 లేదా 2వ తేదీల నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక కొత్త అల్పపీడనం ఏర్పడి, అది రాబోయే 48 గంటల్లో వేగంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది నవంబర్ 4 లేదా 5 నాటికి కొత్త తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని ప్రైవేట్ వాతావరణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read : రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ టైంలో మొబైల్ చార్జింగ్ బంద్..!
అయితే ఈ కొత్త ముప్పుపై భారత వాతావరణ శాఖ ఇంకా ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదా హెచ్చరికలు జారీ చేయలేదు. ప్రస్తుతానికి అర్నబ్ తుఫాన్ అనంతర సహాయక చర్యలపైనే నిఘా పెట్టిన అధికారులు, నవంబర్ మొదటి వారంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో సాధారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని మాత్రమే పేర్కొన్నారు. నవంబర్ నెల బంగాళాఖాతానికి అత్యంత ప్రమాదకరమైన నెల కావడంతో తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు వాతావరణ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని, వాతావరణ శాఖ అధికారిక బులిటెన్లను మాత్రమే ఫాలో అవ్వాలని స్పష్టం చేశారు.


