వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం మరింత ముదురుతోంది. చెల్లెలు షర్మిలకు దక్కాల్సిన వాటా దక్కకుండా జగన్ కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలకు ప్రస్తుత పరిస్థితులు మరింత బలం చేకూరుస్తున్నాయి. తాజాగా యలహంక ప్యాలెస్‌లో మేనకోడలి పెళ్లికి జగన్ నిరాకరించడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలనే షర్మిల బంధువుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తన తండ్రి, మాజీ సీఎం YSR బతికి ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలనూ తన రెండు కళ్లలా చూసుకున్నారని, ప్రతి చోటా ఇద్దరి కోసం పక్కపక్కనే రెండు భవనాలు కట్టించారని వైఎస్ షర్మిల సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ బతికున్నప్పుడు ఎక్కడికి వెళ్లినా జగన్ ఇంట్లో కాకుండా తన ఇంట్లోనే ఉండేవారని ఆమె గుర్తుచేసుకుంటుననారు.
Also Read : ఎమ్మెల్యేల రాజీనామాపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
అయితే, తండ్రి హఠాన్మరణం తర్వాత తనకు న్యాయపరంగా దక్కాల్సిన ఆస్తులపైనా తన అన్న జగన్ కన్నేశారని, అవన్నీ తనవేనంటూ తనకు పైసా ఆస్తి కూడా లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని షర్మిల మనస్తాపం చెందుతున్నారు. బెంగళూరు యలహంకలో ఉన్న రెండు భవనాల ఆస్తి మొత్తం జగన్‌దే అని చెప్పుకుంటే..వైఎస్సార్ తమ ఇద్దరి కోసం ప్రతిచోటా పక్కపక్కనే కట్టించిన మిగతా భవనాలన్నీ జగన్‌వే ఎలా అవుతాయని షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ యలహంక ఆస్తి జగన్‌దే అనుకుంటే, మరి ఇడుపులపాయ ఎస్టేట్‌లో కట్టించిన రెండు భవనాలపై కూడా జగనే హక్కుదారు అవుతారా అని నిలదీస్తున్నారు.
Also Read : షర్మిలకు జగన్ వివాదాస్పద లేఖ..!
ఈ ఏడాది మార్చి 26న తల్లి విజయలక్ష్మి ఇచ్చిన అఫిడవిట్లో యలహంకలోని ఓ భవనం షర్మిలదేనని స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని బంధువుల వద్ద ప్రస్తావిస్తున్నారు షర్మిల. యలహంకలోని ఇంట్లో తన కుమార్తె అంజలిరెడ్డి పెళ్లి వేడుక చేయడానికి జగన్ అడ్డుపుల్లలు వేయడం, ఆ ఇల్లు ఇచ్చేది లేదని అభ్యంతరం చెప్పడం షర్మిలను తీవ్రంగా కలిచివేసింది. పైగా ఆ భవనంతో పాటు మొత్తం ఆస్తిని తన నివాసంగా జగన్ పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సొంత మేనకోడలు, మేనల్లుడికి చెందాల్సిన ఆస్తులను కాజేయాలని చూస్తున్న జగన్ కంస మామ కాకపోతే మరేమిటని షర్మిల బంధువుల వద్ద వాపోయినట్లు సమాచారం.
వైఎస్సార్ అసలు ప్రతి చోటా రెండు భవనాలు ఎందుకు కట్టించారో చెప్పే ధైర్యం, దమ్ము జగన్‌కు ఉందా అని షర్మిల సవాల్ విసిరారు. వైఎస్సార్ ఫ్యామిలీలో ఈ ఆస్తుల వివాదం, జగన్ తీరుపై షర్మిల పడుతున్న ఆవేదన ఇప్పుడు బంధువులు, సన్నిహితులతో పాటు సాధారణ ప్రజలు, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


