ఏపీలో క్లీన్ ఎనర్జీ అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం మరో కీలక మైలురాయిని అధిగమించిందని ప్రకటించారు. రాయలసీమ పరిధిలోని కర్నూలు జిల్లాలో 2,400 ఎకరాల విస్తీర్ణంలో, ఎస్‌ఏఈఎల్ సంస్థ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన 600 మెగావాట్ల సామర్థ్యం గల భారీ సోలార్ ప్లాంట్ నుంచి విద్యుదుత్పత్తి అధికారికంగా ప్రారంభమైంది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అవుతున్న స్వచ్ఛమైన సౌర విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విజయవంతంగా సరఫరా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
Also Read : 100% ఇథనాల్ కేంద్రం సంచలన నిర్ణయం..!
రూ.3,000 కోట్ల భారీ పెట్టుబడితో, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల కాలంలోనే ఎస్‌ఏఈఎల్ సంస్థ ఈ సోలార్ ప్లాంట్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. నేషనల్ గ్రిడ్‌కు నేరుగా విద్యుత్‌ను అనుసంధానించే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏటా దాదాపు 11 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఈ భారీ సముదాయంలో పంజాబ్, రాజస్థాన్ లోని సొంత తయారీ కేంద్రాల్లో అసెంబుల్ చేసిన 12 లక్షలకు పైగా అధునాతన TOPCon బిఫేషియల్ మాడ్యూల్స్ సోలార్ ప్యానెళ్లను వినియోగించారు.
Also Read : బెంగళూరు ప్యాలెస్‌లో సజ్జల, అవినాష్‌లపై జగన్ చిందులు..?
ఈ అద్భుత విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు.. క్లీన్ ఎనర్జీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ పునరుజ్జీవనానికి ఈ సోలార్ ప్లాంటే నిదర్శనమన్నారు. తాము ఎన్నికల వేళ చెప్పాం.. చేస్తున్నాం అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేక వీడియోను ఆయన పంచుకున్నారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశానికే రాజధానిగా మార్చాలనే స్పష్టమైన విజన్‌తో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో రూ.10 లక్షల కోట్ల మేర హరిత ఇంధన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


