ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. రైతన్నలకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులను అలర్ట్ చేశారు. ఇలాంటి సంక్షోభ సమయంలో రైతన్నలకు అండగా నిలవడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది.
యుద్ధప్రాతిపదికన రక్షణ తడులు, నీటి యాజమాన్యం:
రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించి, తేమ ఒత్తిడికి గురవుతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వ్యవసాయ, జలవనరుల శాఖలు సంయుక్తంగా పనిచేస్తూ అందుబాటులో ఉన్న ప్రతీ నీటి వనరును వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటలకు అవసరమైన రక్షణ తడులు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Also Read : సనాతన ధర్మం.. చేప కూర చుట్టూ రాజకీయం..!
ఈ-పంట, ఆధునిక సాంకేతిక విధానాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఎకరాను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, రైతులకు సకాలంలో సలహాలు, సూచనలు అందిస్తున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని రైతులను ప్రోత్సహిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయే రైతన్నలకు భరోసా కల్పించేలా పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం మరింత విస్తరించింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది లక్షలాది మంది రైతులు బీమా కింద నమోదు చేసుకునేలా ప్రోత్సహించి, వారికి పూర్తి భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల కష్టకాలంలోనూ అన్నదాతలకు ఆర్థికంగా రక్షణ లభిస్తుంది.
కేవలం వ్యవసాయ రంగమే కాకుండా, పశుపోషకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఎల్-నినో ప్రభావం వల్ల పశుగ్రాసానికి కొరత రాకుండా తగిన నిల్వలను ఏర్పాటు చేయడం, గ్రామస్థాయిలో పశువులకు తాగునీరు, వైద్య సేవలు అందేలా ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. తాగునీటి సరఫరాకు ఎక్కడా అంతరాయం కలగకుండా అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు.
Also Read : నిర్ణయం చంద్రబాబు.. పవన్ దే.. జనసేన మంత్రి కీలక కామెంట్స్..!
మొత్తంగా చూస్తే, ఎల్-నినో రూపంలో ముంచెత్తుతున్న కరువు ముప్పును ముందుచూపుతో అంచనా వేసి, ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని క్షేత్రస్థాయిలోకి దించి రైతన్నలకు కొండంత భరోసానిస్తోంది కూటమి ప్రభుత్వం.

