ఉత్తరాంధ్ర వైసీపీలో కీలక నేతగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను రాజీనామా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కుమార్తెతో కలిసి టీడీపీలో చేరడం మరింత ఆసక్తిని రేపింది. పార్టీలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, తన మేనమామ బొత్స సత్యనారాయణతో కూడా ఎలాంటి విభేదాలు లేవని చిన్న శ్రీను స్పష్టం చేసినప్పటికీ.. ఆయన పార్టీ మారడం వెనుక అసలు కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read : క్షణాల్లో మాట మార్చేసిన వైసీపీ.. ఏందయ్యా ఇది..!
చిన్న శ్రీను పార్టీ మార్పు ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొంతకాలంగా టీడీపీ ముఖ్య నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారని, జిల్లా పరిషత్ చైర్మన్‌గా తన పదవీకాలం ముగుస్తున్న సమయంలో రాజకీయంగా తదుపరి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా పార్టీలో అన్యాయం జరిగితే నేతలు పార్టీ మారడం సహజం. కానీ చిన్న శ్రీను విషయంలో మాత్రం పరిస్థితి భిన్నమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు రాజకీయంగా, వ్యక్తిగతంగా మంచి ప్రాధాన్యం లభించిందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అలాంటప్పుడు పార్టీని వీడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.
వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలను విజయసాయిరెడ్డి పర్యవేక్షించిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి. అప్పట్లో బొత్స సత్యనారాయణతో విజయసాయిరెడ్డికి రాజకీయ విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఉండేది. ఈ నేపథ్యంలో బొత్స కుటుంబానికి దగ్గరగా ఉన్న చిన్న శ్రీనుకు విజయసాయిరెడ్డి ప్రాధాన్యం ఇవ్వడం, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయనకు కీలక స్థానం కల్పించడం చర్చనీయాంశంగా మారింది. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి విషయంలో కూడా అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాలు చిన్న శ్రీను ఎదుగుదలకు దోహదపడ్డాయనే వాదనలు ఉన్నాయి. విజయసాయిరెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని చిన్న శ్రీను రాజకీయంగా తన ఎదుగుదలకు ఉపయోగించుకున్నారని వైసీపీ వర్గాల్లో అప్పట్లోనే చర్చ సాగింది. అయితే అదే సమయంలో తనను రాజకీయంగా ప్రోత్సహించిన బొత్స కుటుంబంతో దూరం పెరగడం మాత్రం ఇప్పుడు కీలక అంశంగా మారింది.
Also Read : పీసీఓఎస్ సమస్యను డైట్, స్ట్రెంత్ ట్రైనింగ్‌తో నయం చేయవచ్చా..?
మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా చిన్న శ్రీనుకు గతంలో మంచి ప్రాధాన్యం ఇచ్చారనే వాదన ఉంది. ఇటీవల కూడా జగన్‌ను చిన్న శ్రీను కలిశారని, రాజకీయంగా చురుగ్గా పనిచేయాలని, భవిష్యత్తులో తాను అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే రాజకీయ భవిష్యత్తుపై జగన్‌పై నమ్మకం ఉన్నప్పటికీ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తనపై ఉన్న కేసులు, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలపై ఆందోళన ఆయన పార్టీ మార్పునకు కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చిన్న శ్రీను పార్టీ మార్పు ముందు విజయనగరం జిల్లా పరిషత్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి తన కుమార్తె అనూష పోటీ చేస్తారని బొత్స సత్యనారాయణ ప్రకటించడం చిన్న శ్రీనుకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారిందనే ప్రచారం ఉంది. అయితే ఇది ఒక్కటే పార్టీ మార్పునకు కారణమా..? అంటే.. రాజకీయ వర్గాలు మాత్రం కాదనే అంటున్నాయి. చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కూడా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో.. ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం తండ్రి కొత్త రాజకీయ వేదికను ఎంచుకున్నారనే ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది.
Also Read : అమెరికాలో కాగ్నిజెంట్ సంస్థకు భారీ షాక్..!
చిన్న శ్రీను పార్టీ మారడం వైసీపీకి రాజకీయ నష్టమే కాకుండా.. వ్యక్తిగతంగా బొత్స సత్యనారాయణకు కూడా పెద్ద సవాలుగా మారింది. బొత్స కుటుంబం విజయనగరం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన నేతలపైనే వైసీపీ కూడా జిల్లాలో ప్రధానంగా ఆధారపడుతూ వచ్చింది. అయితే అదే కుటుంబం నుంచి ఎదిగిన చిన్న శ్రీను ఇప్పుడు పార్టీకి దూరం కావడం వైసీపీకి కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు బొత్స నీడలో రాజకీయంగా ఎదిగిన చిన్న శ్రీను.. ఇప్పుడు ఆయనకు రాజకీయంగా ఎదురుగా నిలబడే పరిస్థితి రావడం ఆసక్తికర పరిణామంగా మారింది. మామ బొత్స కుమార్తె అనూష ఒకవైపు.. మేనల్లుడు చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర మరోవైపు నిలబడే పరిస్థితి వస్తే.. ఎన్నికల పోరు కేవలం ఇద్దరు వారసుల మధ్య పోటీగా ఉండదు. అసలు సమరం మాత్రం బొత్స వర్సెస్ చిన్న శ్రీనుగానే మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

