సిఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ, నిరంతర పర్యవేక్షణతో జల జీవన్ మిషన్ – అమరజీవి జలధారల భారీ తాగునీటి ప్రాజెక్టు పనులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. పశ్చిమ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ. 2,370 కోట్ల భారీ ప్రాజెక్టు పనుల్లో ప్రస్తుతం కీలక పురోగతి నమోదైంది.
Also Read : ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్.. ఫలించిన పవన్ కృషి
ఈ మెగా ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఇంటేక్ వెల్, అత్యాధునిక నీటి శుద్ధి కేంద్రాలు, మరియు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణ పనులు ప్రస్తుతం ఆఖరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రికార్డు సమయంలో దాదాపు 130 కిలోమీటర్ల మేర ప్రధాన పైప్‌లైన్ల నిర్మాణాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పనుల ప్రగతిని సమీక్షిస్తుండటంతో, ఎక్కడా జాప్యం లేకుండా పనులు అత్యంత పారదర్శకంగా, వేగంగా సాగుతున్నాయి.
Also Read : ఏపిలో కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!
ఈ భారీ జలధారల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలోని 18 మండలాలు, వాటి పరిధిలోని 3,163 గ్రామీణ ఆవాసాలకు ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల పశ్చిమ ప్రాంతంలో ఉన్న దాదాపు 25 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత చేకూరనుంది. ఎండకాలం వస్తే ట్యాంకర్ల వైపు చూసే పరిస్థితికి స్వస్తి పలికి, పశ్చిమ చిత్తూరును జలకళతో నింపేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలపై స్థానిక ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.



