విజయనగరం జిల్లా పరిషత్ పీఠం చుట్టూ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యక్ష రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన ఇద్దరు సీనియర్ నేతలు.. ఇప్పుడు తమ రాజకీయ వారసులను జిల్లా పరిషత్ పీఠంపై కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నారన్న చర్చ జిల్లాలో ఆసక్తి రేపుతోంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకవైపు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు మరోవైపు.. తమ వారసుల రాజకీయ భవిష్యత్తుకు జిల్లా పరిషత్‌ను వేదికగా చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవితో పాటు విజయనగరం మేయర్ పీఠం కూడా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య చర్చకు వస్తోంది. మేయర్ పదవిని టీడీపీ తీసుకుంటే.. జిల్లా పరిషత్ పీఠాన్ని తమకు కేటాయించాలని జనసేన కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ పరిణామాల మధ్య జిల్లా పరిషత్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read : కృష్ణా జలాల పంచాయతీ.. అసలు వాటా ఎంత..?
టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు తన రాజకీయ వారసుడు రామ్ మల్లిక్ నాయుడిని స్థానిక రాజకీయాల్లో బలంగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి దక్కితే.. రాజకీయ అరంగేట్రానికే మంచి గుర్తింపు లభిస్తుందని ఆయన వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం తమకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్న టీడీపీ వర్గాలు.. సరైన రిజర్వేషన్ వస్తే చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని ఏదైనా మండలం నుంచి రామ్ మల్లిక్ నాయుడిని జెడ్‌పీటీసీగా బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక బొత్స సత్యనారాయణ కుటుంబం సైతం జిల్లా పరిషత్ పీఠంపై కన్నేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బొత్స తన కుమార్తె అనూషను రాజకీయ వారసురాలిగా ముందుకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనూష చీపురుపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా చురుగ్గా వ్యవహరిసున్నారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సమాచారం. విజయనగరం జిల్లా పరిషత్‌లో గతంలో బొత్స కుటుంబానికి ఉన్న రాజకీయ ఆధిపత్యం కూడా ఈసారి వారి వ్యూహానికి బలం ఇస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : పేపర్ మిల్లు మూసేస్తారా.. లేదా..?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇద్దరు నేతల వారసులు కూడా చీపురుపల్లి నియోజకవర్గం నుంచే జెడ్‌పీటీసీగా పోటీ చేసే అవకాశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుర్ల, గరివిడి, మెరక ముడిదాం మండలాల్లో రిజర్వేషన్ తమకు అనుకూలంగా వచ్చే మండలాన్ని ఎంచుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణపై కిమిడి కళా వెంకటరావు విజయం సాధించారు. ఇప్పుడు అదే ఇద్దరు ప్రత్యర్థుల వారసులు స్థానిక ఎన్నికల బరిలోకి దిగితే.. రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.
ఒకప్పుడు ఇద్దరు నేతలు నేరుగా తలపడిన చీపురుపల్లి రాజకీయ పోరు.. ఇప్పుడు వారి వారసుల వంతు కానుందా..? అన్న చర్చ మొదలైంది. జెడ్‌పీటీసీగా గెలుపొంది.. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఇద్దరి వారసులు బరిలోకి దిగితే, విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఇది మరో ఆసక్తికరమైన ‘వారసత్వ పోరు’గా మారే అవకాశం ఉంది. ఒక తండ్రి గెలిచాడు.. మరో తండ్రి ఓడాడు. ఇప్పుడు పీఠం కోసం వారి వారసులు తలపడతారా? అన్నది చూడాలి.

