తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ముసలం రోజు రోజుకూ ముదురుతోంది. ఒకవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. మొన్నటి వరకు మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అసలు తనకు ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలని డిమాండ్ చేశాడు కూడా. చివరికి తన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో తిరుగుబాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పైనే తీవ్ర విమర్శలు చేశారు. నీ సంగతి చూస్తా అంటూ పరోక్షంగా బెదిరించారు. నేనేంటో తెలుసా అంటూ సవాల్ చేశారు కూడా. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ హైకమాండ్ కాస్త గుర్రుగా ఉంది కూడా.
Also Read : కూటమిలో అంతర్గతంగా అసహనం.. నిజమేనా..?
ఓ వైపు రాజగోపాల్ వ్యవహారం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారుతున్న సమయంలోనే మరో కీలక నేత రచ్చ మొదలైంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సమయంలో పరకాలలో జరిగిన బహిరంగ సభలో పరకాల నుంచి మళ్లీ రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కొండ కుటుంబానికి గట్టి షాక్ ఇచ్చాయి. నిజానికి పరకాల సీటు కోసం కొండా సురేఖ దంపతులు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పరకాల నుంచి కొండ కుమార్తెను బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ.. ఇప్పుడే రేవురి ప్రకాశ్ రెడ్డి పేరును రేవంత్ ప్రకటించడంతో కొండా కుటుంబం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖకు, ఇతర ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత కొరవడింది. కొండాపై ఇటీవలే ఉమ్మడి జిల్లా నేతలు సీఎంకు, పీసీసీ చీఫ్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కొండా మురళి అరాచకాలనూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పరకాల సభలో రేవంత్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ప్రశంసించారు. ఇది సాధారణ ప్రోత్సాహం కాకుండా, స్పష్టమైన రాజకీయ సంకేతంగా అభివర్ణిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో సీఎం స్థాయిలో ఇలా పేరు ప్రకటించడం చాలా అరుదు. ఈ ప్రకటనపై కొండా కుమార్తె సుస్మిత మండిపడుతున్నారు. టార్గెట్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఆరోపణలు, బెదిరింపులు చేస్తున్నారు.
Also Read : మాట జాగ్రత్త.. పార్టీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..!
అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారారు. ఇప్పటికే గీత దాటుతున్న ఒకరిద్దరు నేతలకు పార్టీ పెద్దలు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే కొండా సురేఖను వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయినా సరే.. కొండా సుస్మిత వెనక్కి తగ్గకపోవడంపై కాంగ్రెస్ పెద్దలు ఫైర్ అవుతున్నారు. కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. పార్టీ నుంచి బహిష్కరించక ముందే వెళ్లిపోండి అని కొండా సురేఖను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తామంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా ఉన్నామని బీర్ల ఐలయ్య ప్రకటించారు. ఓ నటి విషయంలో కూడా సురేఖ ఇలాగే మాట్లాడి పార్టీ పరువు తీశారని.. సీఎంపై ఎవరు విమర్శలు చేసినా సరే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖను ఏ క్షణం అయినా క్యాబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఓ వైపు రాజగోపాల్ రెడ్డి… మరోవైపు కొండా సురేఖ.. తీరుపై పార్టీ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవులే ముఖ్యం అన్నట్లుగా ఈ ఇద్దరు వ్యవహరిస్తున్నారంటున్నారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

